
రాంచీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో TDPL నిర్వహించిన అన్ని పరీక్షలు, ప్రకటించిన ఫలితాలు, నియామక ప్రక్రియలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. విద్యార్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఇప్పటికే నిర్వహించిన పరీక్షలు, ఫలితాలు, ఎంపికైన అభ్యర్థులు, ప్రస్తుతం కొనసాగుతున్న నియామక ప్రక్రియలతో పాటు TDPLకు సంబంధించిన ఇతర కార్యకలాపాలను కూడా రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు సీఎం హేమంత్ సోరెన్ వెల్లడించారు. దీంతో విద్యార్థుల ఆందోళనలకు ప్రభుత్వం స్పందించినట్లయింది. గత 24 రోజులుగా విద్యార్థులు నిరసనలు చేస్తున్నారని హేమంత్ సోరెన్ తెలిపారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తరఫున మంత్రుల కమిటీ చర్చలు జరిపిందని, విద్యార్థులు చేసిన పలు డిమాండ్లను ఇప్పటికే ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. అయితే చర్చలు పూర్తిస్థాయిలో ఫలించకపోవడంతో తాజాగా కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
2014 నుంచి జరిగిన పరీక్షలపై విచారణ
2014 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి సోరెన్ తెలిపారు. సీఐడీ, ఎస్‌ఐటీ దర్యాప్తుల్లో ఇప్పటికే పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. పరీక్షల్లో మోసం, రిగ్గింగ్‌కు సంబంధించి జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా నియమితులైన కొందరిపై అరెస్టులు కూడా జరుగుతున్నాయని చెప్పారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను పాటించకపోవడమే సమస్యలకు కారణమని సీఎం వ్యాఖ్యానించారు. SOPలు ఉన్నప్పటికీ వాటిని సక్రమంగా అమలు చేయకపోవడంతో ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని తెలిపారు.
పేపర్ లీక్‌లను అరికట్టేందుకు ఇప్పటికే చట్టం తీసుకొచ్చామని, పరీక్షా విధానంలో మరింత పారదర్శకత తీసుకురావడానికి సంస్కరణలు చేపడతామని సీఎం హేమంత్ సోరెన్ స్పష్టం చేశారు. విద్యార్థుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్కడ అందే ఫిర్యాదులను నిపుణుల బృందం పరిశీలించనుంది. ఈ సంస్కరణల కార్యక్రమానికి అమితాబ్ కౌశల్ నాయకత్వం వహించనున్నట్లు సీఎం సోరెన్ ప్రకటించారు. అలాగే కేంద్రం MMDR చట్టంలో చేసిన మార్పులపై చర్చించేందుకు త్వరలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అవసరమైతే ఈ అంశంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని హేమంత్ సోరెన్ వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..