రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి అతనిది.. రోజువారీ కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ.. ఉన్నంతలో జీవితమనే జట్కా బండిని సంతోషంగా లాగించేస్తున్నాడు. ఇంతలో అతనికి దిమ్మతిరిగే నోటీసులు అందాయి. ఆ నోటీసులోని సారాంశం తెలుసుకుని షాక్‌కు గురయ్యాడు. ఇంతకీ ఆ నోటీసుల్లో ఏముందో తెలిస్తే మీరూ షాక్ అవుతారు. ఆ రోజువారి కూలీకి ‘రూ.3.5 కోట్ల జీఎస్టీ ఎగవేసినందుకు నీపై కేసు నమోదు చేశాం. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం.’ ఇదీ ఆ నోటీసు కథ. ఇది చూసిన ఆ వ్యక్తి మూడుపూటలా తినేందుకే తిప్పలు పడుతున్నాంరా దేవుడా అంటే.. ఈ జీఎస్టీ ఏంటి అని బిత్తరపోయాడు. అతనే కాదు.. ఈ నోటీసుల ప్రకారం సదరు వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసుల పరిస్థితి కూడా అదేనట. ఆ కూలీని చూసి పోలీసులు సైతం కంగుతిన్నారట. ఈ ఆసక్తికర ఘటన జార్ఖండ్‌లో రాయ్‌పహారీ గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళితే.. లాదున్ ముర్ము మేనేజింగ్ డైరెక్టర్‌గా అతని పేరిట ఎంఎస్ స్టీల్ కంసెనీ ఉంది. ఆ స్టీల్ కంపెనీ రూ.3.5 కోట్ల జీఎస్టీ ఎగవేసిందని, ఆ మేరకు జార్ఖండ్ స్టేట్ జీఎస్టీ డిపార్ట్‌మెంట్ ముర్ముపై కేసు నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా పోలీసులు లాదున్ ముర్మును అరెస్ట్ చేయడానికి వెళ్లారు. అక్కడ లాదున్ ముర్మును, అతని ఇంటిని చూసి పోలీసులు షాక్ అయ్యారు. అసలేం జరిగిందని ఆరా తీయగా.. లాదున్ పేరిట ఎవరో నకిలీ కంపెనీ ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ తరువాత అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.