ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం నోయిడాలోని జెవార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ పశ్చిమ ఉత్తరప్రదేశ్, దేశ రాజధాని ఢిల్లీలో కోట్లాది ప్రజలకు ఉపయోగం ఉంటుందని మోడీ చెప్పారు. బహుళ-రన్‌వే విమానాశ్రయం, మొదటి దశ 2024లో కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇది దేశ రాజధాని, దాని పొరుగు ప్రాంతాలకు సేవలందించే రెండవ విమానాశ్రయం. ఇది మొదటి దశ పూర్తయిన తర్వాత ప్రతి సంవత్సరం 12 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించనుంది. 4వ దశ ముగిసే సమయానికి ఏటా 70 మిలియన్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనుంది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (NIA), ఢిల్లీలోని ప్రస్తుత IGI విమానాశ్రయానికి 72 కి.మీ దూరంలో ఉంది.
“భూమి పూజ కోసం వచ్చిన ప్రతి ఒక్కరినీ అభినందించాలనుకుంటున్నాను. ఈ ప్రాంతం అంతర్జాతీయ స్థాయిలో గుర్తుంపు పొందుతుంది. ఎన్‌సీఆర్, పశ్చిమ యూపీలోని కోట్లాది మందికి భారీ ప్రయోజనం కలుగుతుంది. 21వ శతాబ్దపు కొత్త భారతదేశం అత్యాధునిక సాంకేతిక ప్రాజెక్టులపై పని చేస్తోంది. ఇవి కేవలం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మాత్రమే కాదు, ఈ ప్రాంతాన్ని, ప్రజల జీవితాలను మారుస్తాయి” అని మోడీ అన్నారు. ఈ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, గౌతమ్ బుద్ధ్ నగర్ ఎంపీ మహేశ్ శర్మ, జేవార్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు. “నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం లాజిస్టికల్ గేట్‌వే అవుతుంది. ఏవియేషన్ రంగం ఎంత వేగంతో పురోగమిస్తోంది, నోయిడా విమానాశ్రయం అందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది… మరమ్మత్తు, నిర్వహణకు కూడా ఇది ముఖ్యమైనది. మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (MRO) సేవల కోసం 40 ఎకరాల స్థలం ఉంటుంది” అని ప్రధాని చెప్పారు. “దాదాపు రూ. 15,000 కోట్లు ఈ ఎయిర్పోర్టు నిర్మాణానికి ఖర్చు చేయనున్నారు.
ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని గత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని మోడీ గుర్తు చేశారు. “కుల రాజకీయాలు, వేల కోట్ల కుంభకోణాలు, అధ్వాన్నమైన రోడ్లు, పేదరికం, పెట్టుబడుల కొరత, ఆగిపోయిన వ్యాపారాలు, రాజకీయాలు, నేరస్థుల మధ్య బంధం కారణంగా ఈ రాష్ట్రంలోని ప్రజలు అవమానాలు ఎదుర్కొన్నారు.” అని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల పాలనలో చీకట్లు, నిర్వీర్యానికి దారితీసిన రాష్ట్రం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తనదైన ముద్ర వేస్తోంది’’ అని మోడీ అన్నారు.
Read Also.. Anna Hazaare: అస్వస్థతకు గురైన అన్నా హజారే.. ఆస్పత్రికి తరలింపు.. ఆరా తీసిన మహారాష్ట్ర సీఎం..