
కరోనా నివారణకు ప్రధాని మోదీ ఇఛ్చిన పిలుపు మేరకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ మొదలయింది. కోట్లాది మంది ఇళ్లకే పరిమితమయ్యారు. కోవిడ్-19 ని ఎదుర్కోవాలంటే ప్రజలంతా సుమారు 12 గంటలపాటు సెల్ఫ్ ఐసొలేషన్ పాటించాలని మోదీ సూచించిన సంగతి తెలిసిందే. మనం ఈ మహమ్మారిని జయించాలంటే ఆరోగ్యంగా ఉండాలని, సోషల్ డిస్టెన్స్ మెయిన్ టెయిన్ చేయాలనీ కూడా ఆయన అన్నారు. దీంతో దేశంలో కేవలం నిత్యావసర సర్వీసులు మినహా అన్ని సేవలూ నిలిచిపోయాయి. రవాణా, రైలు సర్వీసులు స్తంభించిపోగా.. ఇండిగోవంటి ఎయిర్ లైన్స్ సంస్థలు కూడా తమ విమాన సర్వీసులను రద్దు చేయడమో, పాక్షికంగా నడపడమో చేశాయి. పశ్చిమబెంగాల్ లో ఓ పురుషుడు, పూణే లో ఒక మహిళ ఏ విదేశీ ప్రయాణమూ చేయకున్నా వారికి కరోనా పాజిటివ్ లక్షణాలున్నట్టు తేలింది. దీంతో మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 315 కి పెరిగింది.
ఇలా ఉండగా తెలంగాణాలో మొత్తం ప్రజాజీవనం స్తంభించిపోయింది. ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటలవరకు ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సర్వీసులు మినహా అన్నీ బంద్ అయ్యాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్లు, బస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లు నిర్మానుష్యంగా కనిపించాయి. రాజధాని హైదరాబాద్ లో ఉదయం ఆరు గంటలనుంచి అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. చిన్న చిన్న హోటళ్లు, వ్యాపార సముదాయాలను కూడా మూసివేశారు.