ఇరుకునపడ్డ కాంగ్రెస్.. EVMలకు సపోర్ట్‌గా ఆ రాష్ట్ర సీఎం కీలక వ్యాఖ్యలు

|

Dec 15, 2024 | 7:20 PM

హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈవీఎంపై నమ్మకం లేదంటున్న కాంగ్రెస్ నేతలు.. పాత బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎంల విషయంలో కాంగ్రెస్ వైఖరిని తప్పుబడుతూ ఇండియా కూటమిలో భాగస్వామ్యపక్షమైన నేషనల్ కాన్ఫెరెన్స్ నేత, జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(Jammu and Kashmir CM Omar Abdullah) వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇరుకునపడ్డ కాంగ్రెస్.. EVMలకు సపోర్ట్‌గా ఆ రాష్ట్ర సీఎం కీలక వ్యాఖ్యలు
EVM
Follow us on

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు ఈవీఎంల చుట్టూ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చెందిన మహా వికాస్ అఘాడీ(MVA) ఈవీఎంలను నిందిస్తోంది. ఈవీఎంలపై ప్రజలకు విశ్వాసం లేదని, బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించాలని ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ తదితరులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మహారాష్ట్రలో ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నాయి. శనివారంనాడు ఈవీఎంలకు శవయాత్ర నిర్వహించి తమ నిరసన వ్యక్తంచేశారు. అధికార మహాయుతి ఈవీఎంకు భారీ ఆలయాన్ని నిర్మించుకుంటే మంచిదని శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత సంజయ్ రౌత్ సలహా ఇచ్చారు.

అయితే ఇండియా కూటమిలో భాగస్వామ్యపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ (NC) నేత, జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah).. కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా ఈవీఎంలను సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచినప్పుడు ఒకలా.. ఓడినప్పుడు మరోలా ఈవీఎంలపై రాజకీయ పార్టీలు స్పందించడం సరికాదన్నారు. పార్లమెంటులో 100కు పైగా స్థానాల్లో విజయం సాధించినప్పుడు సంతృప్తి చెందిన కాంగ్రెస్ పార్టీ.. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా లేదని ఈఎంలకు నిందించడం సరికాదన్నారు.

ఈవీఎంలపై నమ్మకం లేని పక్షంలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటమే మంచిదన్నారు. ఈ విషయంలో ఒక్కో సమయంలో ఒక్కోలా మాట్లాడటం సరికాదన్నారు. ఎన్నికల్లో ఓటమి చెందినా.. గతంలో తానెన్నడూ ఈవీఎంలను కారణంగా చూపలేదని గుర్తుచేశారు.

ఈవీఎంలను సమర్థిస్తూ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు

ఈవీఎంల విషయంలో మీ వ్యాఖ్యలను బీజేపీ వైఖరిని సమర్థించేలా ఉన్నాయని మీడియా ప్రతినిధి ఒమర్ అబ్దుల్లాను ప్రశ్నించగా.. తాను ఏది కరెక్ట్ అయితే అదే మాట్లాడుతానని సమాధానమిచ్చారు. ఈ విషయంలో తన వైఖరి పూర్తిగా సైద్ధాంతికమైనదిగా వ్యాఖ్యానించారు. పార్లమెంటు నూతన భవన నిర్మాణాన్ని కూడా సమర్థిస్తున్నట్లు చెప్పారు. పార్లమెంటు నూతన భవన నిర్మాణ అంశం చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నదని గుర్తుచేశారు.