
మహారాష్ట్రలోని జల్నా జిల్లా బదనాపూర్ పరిసరాల్లో చోటుచేసుకున్న ఘోర హత్య కేసు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వదినతో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో సొంత అన్నను చంపేశాడు దుర్మార్గుడు. దీనికి ఆమె కూడా సహకరించడం గమనార్హం. బదనాపూర్ పోలీసులు ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
సోమఠాణా గ్రామానికి చెందిన పరమేశ్వర్ రాం తాయ్డే (30)కి… మణీషా (25)తో వివాహం జరిగింది. పరమేశ్వర్ సొంత తమ్ముడు జ్ఞానేశ్వర్ తాయ్డేతో (28) మణీషాకు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. వారి వ్యవహారం తెలియడంతో.. పరమేశ్వర్ ఇద్దర్ని హెచ్చరించాడు. తీరు మార్చుకోవాలని సూచించాడు. దీంతో తమ బంధాన్ని కొనసాగించడానికి పరమేశ్వర్ అడ్డంకిగా మారాడని భావించిన జ్ఞానేశ్వర్, మణీషాఅతన్ని దారుణంగా అంతమొందించే ప్లాన్ వేసుకున్నారు. అక్టోబర్ 15 అర్థరాత్రి ఒంటి గంట సమయంలో మణీషా, జ్ఞానేశ్వర్‌లు పరమేశ్వర్‌పై పాశవిక దాడికి పాల్పడ్డారు. అతను నిద్రలో ఉండగా.. తల, ముఖంపై గొడ్డలితో దాడి చేసి అక్కడిక్కడే హతమార్చేశారు. ఆ తర్వాత నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్లానింగ్ మొదలైంది. నేరం బయటపడకుండా ఉండేందుకు నిందితులు పరమేశ్వర్ మృతదేహాన్ని ఓ పెద్ద గోనె సంచిలో పెట్టి, దానికి తాడుతో భారీ రాయి కట్టి.. స్థానిక చెరువులో పడేసారు.శవం పైకి తేలకూడదనే ఉద్దేశంతో ఆ రాయి కట్టారని పోలీసు విచారణలో వెల్లడైంది.
దీంతో పరమేశ్వర్ ఇంటికి రాకపోవడంతో గ్రామంలో అనుమానాలు మొదలయ్యాయి. అప్పటికే గ్రామంలో భార్య, మరిది మధ్య అనైతిక సంబంధం ఉందన్న చర్చ నడుస్తోంది. పరమేశ్వర్ కనిపించకపోవడంతో జనాలకు కొత్త అనుమానం మొదలైంది. నవంబర్ 12 ఉదయం 11 గంటల సమయంలో బదనాపూర్ పరిధిలోని నికళజ్ శివార్‌లోని చెరువులో తేలుతున్న శవాన్ని గుర్తించారు. ఆపై అది పరమేశ్వర్‌దేనని ధృవీకరించారు. తండ్రి రామనాథ్ తాయ్డే ఇచ్చిన ఫిర్యాదు మేరకు IPC 302 కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఇంటి పరిసరాల్లోనే పరమేశ్వర్ హత్య జరిగినట్లు పోలీసులకు స్థానికుల నుంచి సమాచారం వచ్చింది వెంటనే మణీషా, జ్ఞానేశ్వర్‌లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
మొదట ఇద్దరూ తప్పించుకునే ప్రయత్నం చేసినా… పోలీసులు సేకరించిన ఆధారాల్ని చూపించడంతో వెంటనే నేరాన్ని ఒప్పుకున్నారు. తమ అనైతిక బంధానికి అడ్డుగా ఉన్నాడనే చంపినట్లు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.