ISRO Samudrayaan Project: మేరా భారత్ మహాన్.. సముద్ర లోతుల్లో ఇస్రో సాహస ప్రయోగం.. మామూలు ప్లాన్ కాదుగా..!

భారత్ అంతరిక్ష ప్రయోగాల్లో మాత్రమే కాదు.. సముద్ర లోతుల్లో ఉన్న రహస్యాలను తెలుసుకునేందుకు కీలక ప్రయోగాలు చేపడుతోంది. ఇప్పటికే గగన్ యాన్ కోసం సిద్ధమవుతున్న ఇస్రో రెండేళ్ల క్రితమే సముద్రంలో పరిశోధన కోసం సముద్రయాన్ ప్రాజెక్టును ప్రకటించి పరిశోధనలు ప్రారంభించింది. సముద్రం లోపల వేల మీటర్ల లోతున శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.. భారత్ చేపట్టిన సముద్ర యాన్ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం..

ISRO Samudrayaan Project: మేరా భారత్ మహాన్.. సముద్ర లోతుల్లో ఇస్రో సాహస ప్రయోగం.. మామూలు ప్లాన్ కాదుగా..!
Isro Samudrayaan Project

Edited By:

Updated on: Jan 20, 2026 | 3:10 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అతి త్వరలోనే సముద్రయాన్ ప్రాజెక్టుతో సముద్రపు లోపల ఉన్న రహస్యాలను తెలుసుకునేందుకు కీలక ప్రయోగం చేపట్టనుంది.. రెండేళ్ల క్రితమే సముద్రయాన్ ప్రాజెక్టును ఇస్రో అనౌన్స్ చేసింది.. అందుకోసం ప్రత్యేక సబ్ మెరైన్ ను రూపొందించింది. సముద్రయాన్ మిషన్ అనే ప్రయోగం ద్వారా మహా సముద్రాల అన్వేషణలో భాగంగా సముద్రాల లోపల ఉన్న ఖనిజ సంపదను అన్వేషించడానికి భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకు వేసి మహా సముద్రాలలో ఉన్న ఖనిజ సంపదను కనుగొనేందుకు మత్స్య 6000 అనే సబ్ మెర్సిబుల్ మిషన్ ద్వారా చెన్నై తీరంలోని 5 వేల మీటర్ల లోతులో ప్రయోగాత్మక ప్రయోగాలు చేపట్టారు. ఆ తర్వాత మరింత లోతులో పరిశోధనలు చేపట్టనుంది.

ఈ ప్రయోగం విజయవంతం అయితే 2026 లేదా 2027 చివరిలో మానవ సహిత సముద్రయాన్ ప్రాజెక్ట్ ను ఇస్రో జరుపనుంది. 28 టన్నులు బరువు కలిగిన మత్స్య 6000 అనే సబ్ మెరైన్ మిషన్ ద్వారా ఈ ప్రాజెక్ట్ ను జాతీయ మహా సముద్ర సాంకేతిక సంస్థ ద్వారా ప్రాజెక్ట్ డైరెక్టర్ బాలాజీ రామకృష్ణన్ పర్యవేక్షణలో సముద్రయాన్ మిషన్ ను పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో మానవ సహిత గా ముగ్గురు శాస్త్రవేత్తలను ఎంపిక చేసి ఇందులో ప్రయాణించనున్నారు.

అంతరిక్షంలో పరిశోధనలు చేపట్టే శాస్త్రవేత్తలను ఆస్ట్రోనాట్స్ గా పిలుస్తారు. సముద్రం లోపల పరిశోధనలు చేసే వాళ్లను ఆక్వానాట్స్ గా పిలుస్తారు. ఫ్రాన్స్ సహకారంతో భారత్ సముద్రయాన్ ప్రయోగాన్ని చేపడుతుంది. ఇందులో ముగ్గురు శాస్త్రవేత్తలు సబ్ మెరైన్ లో వెళ్లి పరిశోధన చేస్తారు. అందులో ఇద్దరు భారత కు చెందిన శాస్త్రవేత్తలు ఇప్పటికే పరిశోధనలు మొదలుపెట్టారు. వారిలో జితేంద్ర పాల్ సింగ్, రాజు రమేష్ లు ఇప్పటివరకు 5000 మీటర్ల లోతు వరకు డైవ్ చేసిన భారత్ రికార్డుగా ఈ ప్రయోగం ద్వారా సాధించారు. ఈ సబ్మెర్సిబుల్ 12 గంటల పాటు పనిచేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో 96 గంటల వరకు కూడా సముద్రంలో ఉండే సామర్థ్యం కలిగి ఉంది. ప్రయోగం ద్వారా సముద్రంలో ఉన్న ఖనిజాలు, ఖనిజ సంపద, మినరల్స్, కోరల్స్ వంటి ఖనిజాలతో పాటుగా సముద్రంలో ఉన్న ఇసుకలో కూడా ఏతరహా ఖనిజాలు ఉన్నాయి.. వాటి ఉపయోగాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.

ఈ తరహా ప్రయోగాలను ఇప్పటివరకు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనా లాంటి దేశాలు మాత్రమే చేశాయి.. ఇప్పుడు ఇస్రో కూడా ఈ దేశాల సరసన చేరనుంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగానికి సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో ఇస్రో ఒకవైపు గగన్ యాన్ ద్వారా అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేందుకు సిద్ధమవుతూనే సముద్రం లోపల శాస్త్రవేత్తల ద్వారా అత్యంత క్లిష్టమైన కీలకమైన ప్రయోగ ప్రక్రియను పూర్తిచేసే దశలో ఉండటం గర్వకారణమని పలువురు పేర్కొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..