Annamalai: మళ్లీ పగ్గాలు ఆయనకే..! అన్నామలైని పక్కనబెట్టడమే బీజేపీ కొంపముంచిందా..? నెట్టింట జోరుగా చర్చ
ఎవరూ ఊహించని విధంగా 108 స్థానాలతో దళపతి జైత్రయాత్ర సాగిస్తుంటే, కమలం పార్టీ మాత్రం ఒక్క సీటుకే పరిమితమై కుప్పకూలింది. అయితే ఈ పతనానికి కారణం వ్యూహకర్త అన్నామలైని పక్కన పెట్టడమేనా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాత వీడియోలు, కార్యకర్తల ఆవేదన ఇప్పుడు బీజేపీ అధిష్టానాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి. అన్నాడీఎంకేతో పొత్తు పార్టీకి శాపంగా మారిందా? అనేది తెలుసుకుందాం..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి. ఎవరూ ఊహించని విధంగా విజయ్ టీవీకే 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. వామపక్షాలు, కాంగ్రెస్ మద్దతుతో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీ అయిన బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమికి బాధ్యులెవరు? అన్నామలై లేకపోవడమే బీజేపీ కొంప ముంచిందా? ఇప్పుడు ఇదే అంశం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2021 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోరాడి 4 స్థానాలను గెలుచుకోవడమే కాకుండా 11.24% ఓట్లను సాధించింది. కానీ తాజా ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్నప్పటికీ బీజేపీ ప్రభావం చూపలేకపోయింది. ఈ ఎన్ని్కల్లో కేవలం ఊటిలో మాత్రమే గెలిచి ఒకే స్థానానికి పరిమితమైంది. గతంలో 11శాతం ఉండగా, ఇప్పుడు కేవలం 2.97శాతానికి పడిపోవడం పార్టీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎన్డీయే కూటమి ద్వారా అధికారం చేపట్టాలని భావించిన బీజేపీ కలలు కల్లలయ్యాయి. ఇండియా కూటమి మూడో స్థానానికి పరిమితం కాగా అన్నాడీఎంకే-బీజేపీ కూటమి చావుదెబ్బ తింది.
అన్నామలై లేని లోటు..
బీజేపీ ఓటమికి ప్రధాన కారణం తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండటమేనని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో అన్నామలై తన పాదయాత్రలు, దూకుడు రాజకీయాలతో యువతను, మహిళలను బీజేపీ వైపు ఆకర్షించారు. కానీ ఈ ఎన్నికల్లో ఆ ఓటు బ్యాంక్ అంతా కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ వైపు మళ్లిందని ఫలితాలు చెబుతున్నాయి. 2024 ఎన్నికల్లో అన్నాడీఎంకే కంటే బీజేపీకి కొన్ని చోట్ల మెరుగైన ఓట్ల శాతం రావడానికి అన్నామలై వ్యూహాలే కారణమని ఆయన మద్దతుదారులు గుర్తు చేస్తున్నారు. కోయంబత్తూర్ వంటి స్థానాల్లో అన్నాడీఎంకేను వెనక్కి నెట్టి బీజేపీ రెండో స్థానంలో నిలవడం ఆయన క్రెడిట్టేనని వారు వాదిస్తున్నారు.
వైరల్ అవుతున్న పాత వీడియోలు
ఏడాదిన్నర ముందే 234 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్తే బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది” అని గతంలో అన్నామలై మాట్లాడిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అప్పట్లోనే ఆయన చెప్పినట్టు ఒంటరిగా పోరాడి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని, అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని బీజేపీలోని ఒక వర్గం బలంగా నమ్ముతోంది.
అధిష్టానం నిర్ణయం ఏంటి..?
అన్నాడీఎంకేలో ఎవరి ఒత్తిడి వల్ల అన్నామలైను పక్కన పెట్టారో కానీ, ఫలితంగా బీజేపీ తమిళనాడులో ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకుంది. ఇకనైనా పార్టీ అధిష్టానం కళ్లు తెరిచి, తమిళనాడులో బీజేపీని భవిష్యత్తులో అధికారంలోకి తీసుకురావాలంటే మళ్ళీ అన్నామలైకే పగ్గాలు అప్పగించాలని క్షేత్రస్థాయి నేతలు కోరుతున్నారు. తమిళనాడులో బీజేపీ పతనాన్ని విశ్లేషించుకుంటున్న అధిష్టానం, మళ్లీ అన్నామలైని తెరపైకి తెస్తుందా? రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ఆయనను మళ్లీ సారథిని చేస్తారా? అన్నది వేచి చూడాలి.
