కేంద్రం గుడ్‌న్యూస్‌..మ‌రింత విస్తృతంగా ఇంట‌ర్‌నెట్ సేవ‌లు

కేంద్ర‌ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది. కేంద్రం తీసుకోబోయే తాజా నిర్ణ‌యంతో కేబుల్ టీవీ యూజ‌ర్లు, ఉద్యోగుల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగ‌నుంది.

కేంద్రం గుడ్‌న్యూస్‌..మ‌రింత విస్తృతంగా ఇంట‌ర్‌నెట్ సేవ‌లు

Updated on: Jun 09, 2020 | 11:45 AM

కేంద్ర‌ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది. కేంద్రం తీసుకోబోయే తాజా నిర్ణ‌యంతో కేబుల్ టీవీ యూజ‌ర్లు, ఉద్యోగుల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగ‌నుంది. ఇంట‌ర్‌నెట్ సేవ‌ల‌ను మ‌రింత విస్తృత ప‌రిచేందుకు కేంద్రం క‌స‌ర‌త్తు చేస్తోంది. కేబుల్ టీవీ లైన్ ద్వారా ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను అందించాల‌ని కేంద్రం యోచిస్తోంది. దీనికి సంబంధించిన నిబంధనలను ప్ర‌భుత్వం ఇప్ప‌టికే రూపొందించింది. త్వరలోనే వీటికి ఆమోదం లభించనుంది. కాగా దేశంలో 12 కోట్ల ఇళ్లకు కేబుల్ టీవీ సర్వీసులు ఉన్న‌ట్లు గుర్తించారు. ఈ క్ర‌మంలోనే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్ట్రీ ఈ మేరకు కొత్త నిబంధ‌న‌ల‌ను రూపొందించింది. ఈ వారంలోనే డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ కూడా భేటీ కానుంది.
కేంద్ర ప్రభుత్వం వచ్చే ఒక‌టి రెండు నెలల కాలంలో కొత్త రూల్స్‌కు సంబంధించిన నిబంధనలను జారీ చేయనుంది. అలాగే కేబుల్ టీవీ ఆపరేట్లు, ట్రాయ్, టెలికం విభాగాలకు చెందిన వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోనుంది. లైసెన్స్ ఫీజులు, ఏజీఆర్ అంశంపై కూడా చ‌ర్చించ‌నున్నారు. తాజా నిర్ణయం వల్ల 10 కోట్ల మందికి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
కోవిడ్ 19 వల్ల చాలా మంది ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి నెట్‌వర్క్ సమస్యలు పెద్ద త‌ల‌నొప్పిగా మారుతున్నాయి. వీరికి ప్రయోజనం కలిగించేలా కూడా తాజా నిబంధనల‌ను రూపొందించిన‌ట్లుగా స‌మాచారం.  ఇకపోతే బ్రాడ్‌బాండ్ కనెక్షన్స్ డిమాండ్ భారీగా పెరిగింది.  కొత్త రూల్స్ కారణంగా కేబుల్ టీవీ లైన్ ద్వారా బ్రాడ్‌బాండ్ సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తే చాలా మందికి ప్రయోజనం కలుగుతుంది.