International Yoga Day 2022: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారంనాడు హరిద్వార్‌లోని పతంజలి యోగపీఠ్‌లో యోగా గురువు బాబా రామ్‌దేవ్ యోగా చేశారు. రామ్‌దేవ్ బాబా ఉదయం 5 గంటలకు యోగా ప్రారంభించారు. 10 వేల మందికి పైగా ఆయన అనుచరులు ఉదయం 8 గంటల వరకు వివిధ యోగా ఆసనాలను ప్రదర్శించారు. ప్రత్యేక యోగాసనాలు వేసిన బాబా రాందేవ్.. వాటి ద్వారా కలిగే వివిధ ఆరోగ్య ప్రయోజనాలు, వ్యాధుల నివారణ గురించి వివరించారు. ఈ యోగా దినోత్సవ ఈవెంట్‌ను వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటోన్న వేళ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వంగా ఉంది బాబా రాందేవ్ అన్నారు. ఎలాంటి అనారోగ్యం లేకుండా శరీరాన్ని ఉంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. దీని కోసం ప్రతిరోజూ నాలుగు-ఐదు యోగా ఆసనాలు చేయాలని సూచించారు. యోగా ప్రతి ఒక్కరికి సంబంధించినదని పేర్కొన్నారు. యోగాను ఏ మతంతో లేదా రాజకీయ పార్టీతో ముడిపెట్టవద్దని ఆయన కోరారు.
అన్ని మతాల వారు తమ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి, దీర్ఘకాలంగా ఉన్న ఏదైనా వ్యాధిని నయం చేసేందుకు యోగా చేస్తున్నారని అన్నారు. కొంతమంది తమ ఎజెండాతో యోగాని మతంతో ముడిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని.. ఇది సరికాదన్నారు. యోగా మతంతో సంబంధంలేని ఆధ్యాత్మిక కార్యక్రమంగా అభివర్ణించారు. మతంతో సంబంధంలేని ఆధ్యాత్మిక కార్యక్రమం అయినందున ప్రతిపక్ష పార్టీల నాయకులందరినీ యోగా చేయాలని తను అభ్యర్థిస్తున్నా అన్నారు.
అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌పై చెలరేగిన నిరసనపై ఆయన మాట్లాడుతూ.. కొందరికి దేశంలో అశాంతి సృష్టించాలనే ఎజెండా ఉందని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా నాయకత్వం ముందు ప్రతిపక్ష నేతలంతా నిలబడలేకపోతున్నారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు తెచ్చి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకునేలా చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
యోగా డే సందర్భంగా యోగాసనాలు వేస్తున్న బాబా రాందేవ్..
Uttarakhand | On #InternationalYogaDay, Yog Guru Ramdev performs yoga at Patanjali Yogpeeth in Haridwar. Children and many other people also attend the event. pic.twitter.com/5b4qhrmXxl
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 20, 2022
ఆయుష్ మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం మేరకు.. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 వేడుకల్లో పాల్గొంటున్నారని అంచనా. సెప్టెంబరు 27, 2014న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి మొదటిసారిగా ప్రతిపాదించారు. భారతదేశం ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానాన్ని 177 దేశాలు సమర్థించాయి. యోగాకు విశ్వవ్యాప్త గుర్తింపు మరియు పెరుగుతున్న ప్రజాదరణతో, ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 11, 2014న జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21, 2015న జరుపుకున్నారు.