
సరిగ్గా… ఒంటి గంటా ముప్పై నిమిషాలు… లంచ్ టైమ్…! కాలేజ్ నుంచి అప్పుడే అందరూ భోజనం చేసేందుకు మెస్‌కి వెళ్లారు. ప్లేట్‌లో భోజనం పెట్టుకుని… సరదాగా మాట్లాడుకుంటూ తినడం మొదలుపెట్టారు. కానీ ఆ మెస్ కాసేపట్లో యముడి వశం కాబోందని… అదే వాళ్లకు చివరి భోజనం అవుతుందని పాపం ఆ అమాయకులు ఊహించలేకపోయారు. విమానం రూపంలో మృత్యువు వస్తుందని… డాక్టర్ కావాలన్న కలల్ని క్షణాల్లో ఆవిరి చేస్తాడని ఆ మెడికల్ విద్యార్థులు పసిగట్టలేకపోయారు. ఏ తల్లికన్న బిడ్డలో… హాస్టల్ మెస్‌లోనే తమ చివరి మజిలీ పూర్తవుతుందని గుర్తించలేకపోయారు. కనీసం చివరి చూపు కూడా చూసుకోనివ్వకుండా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కొంతమంది ఇంటర్న్ వైద్యులు కాలిపోయి కాంక్రీట్ శిథిలాల కింద నలిగిపోయారు, మరికొందరు ముక్కలుగా కనిపించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఏఐ171 విమానంలో ప్రయాణించిన 242 మందిలో 241 మంది మృతి చెందగా.. అది బిల్డింగ్‌పై కుప్పకూలడంతో 24 మంది చనిపోయారు. వారిలో ఎక్కువమంది మెడికోలు ఉన్నట్లు తెలిసింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది. కాగా మరణాలపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
చెట్టుని ఢీకొన్న ఎయిరిండియా విమానం రెక్క మేఘాని నగర్ సమీపంలో ఉన్న ఇంటర్న్ డాక్టర్ల హాస్టల్ భవనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగడంతో మెస్‌లో భోజనం చేస్తున్న పలువురు మెడికోలు తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. త్వరలోనే డాక్టర్ అవ్వాలి… ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఏళ్లుగా కలలు కన్నవాళ్లు కనీసం కన్నతల్లి సైతం గుర్తుపట్టలేనంత దుర్మరణం పాలయ్యారు.
ప్రమాదం తర్వాత హాస్టల్ మెస్‌లోని దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. సగం భోజనం చేసిన పేట్లు, చల్లాచెదురుగా పడివున్న టేబుల్స్, నేలపై పడిపోయిన అన్నం, కూరలను చూసి ఆ దేవుడ్ని సైతం నిలదీస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. కడుపు నిండా భోజనం చేయనీయకుండానే తీసుకెళ్లావా అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..