దేశంలో పరిశోధనల నాణ్యత పెరగాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు నారాయణ మూర్తి పేర్కొన్నారు. భారత్‌లో తయారైన దగ్గు సిరప్ కారణంగా గాంబియాలో 66 మంది పిల్లలు మృతి చెందడం భారత్‌కు తలవంపు తెచ్చిందన్నారు. బెంగళూరులోని ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్‌లో ఇన్ఫోసిస్ సైన్స్ ప్రైజ్ విజేతలను ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరాలని ఆకాంక్షిస్తున్న భారత్ శాస్త్ర పరిశోధనల్లో మరింత పురోగతి సాధించాల్సి అవసరం ఉందన్నారు. భారతీయ పరిశోధకుల అత్యుత్తమ పరిశోధన ప్రయత్నాలను గుర్తించడం, తగిన ప్రతిఫలమివ్వడం అవసరమన్నారు. రెండు భారతీయ కంపెనీలు కోవిడ్ వ్యాక్సిన్‌లను కోట్ల మందికి అందించినప్పటికి, ఎంతో మంది భారతీయులు శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగంలో ప్రతిష్టాత్మకమైన అవార్డులు పొందారని, ఎంతో గుర్తింపును తెచ్చుకున్నారని అయితే ఇంకా చాలా సవాళ్లు ఉన్నాయన్నారు. అనేక వ్యాధులకు భారత్ ఇంకా టీకాలను అభివృద్ధి చేయలేదన్నారు. పరిశోధనలు విజయంవంతమవడానికి రెండు అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని, డబ్బు అత్యంత ముఖ్యమైనది మాత్రం కాదన్నారు.
పాఠశాలల్లో, కళాశాలల్లో బోధనా విధానం విద్యార్థుల మెదడుకు పదునుపెట్టే విధంగా ఉండాలన్నారు. తరగతిగదిలో విద్యార్థులు నేర్చుకున్నది కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం కంటే చుట్టూ ఉన్న వాస్తవాలను ప్రపంచానికి తెలియజేసేలా బోధన ఉండాలన్నారు.
రెండొవది పరిశోధకుల తక్షణ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించాలన్నారు. 2022లో వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో టాప్ 250లో ఒక్క భారతీయ ఉన్నత విద్యా సంస్థ కూడా లేదనే విషయాన్ని నారాయణమూర్తి తెలిపారు. కాగా ఆరు విభాగాల్లో ఇన్ఫోసిస్ సైన్స్ ప్రైజ్‌లను ఆయన ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..