India Covid: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. రోజువారీ కొత్త కేసుల్లో భారత్ మరో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. కొత్తగా 3.32 లక్షల కేసులు, 2,263 మరణాలు నమోదయ్యాయి. దాదాపు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. ఈ విలయానికి తోడు ఆక్సిజన్ కొరత అందరినీ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తారేమోనన్న ఆందోళన మొదలైంది. అయితే మున్ముందు కరోనా మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. దేశంలో మరో మూడు వారాల తర్వాతగానీ పీక్ స్థానానికి చేరబోదని ఐఐటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మే 11-15 తేదీల మధ్య వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరే అవకాశాలున్నాయని, అప్పటిలోగా యాక్టివ్ కేసుల సంఖ్య 33 నుంచి 35 లక్షలకు పెరుగుతాయని వారు పేర్కొన్నారు. అంతేకాదు, ఏప్రిల్ 25-30 కల్లా ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, తెలంగాణా రాష్ట్రాల్లో కొత్త కేసులు మరింత పెరిగే అవకాశాలున్నాయని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో ఇప్పటికే కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అలాగే మే నెలాఖరుల కల్లా కేసులు బాగా తగ్గిపోతాయని శాస్త్రవేత్తల అంచనా.
మే 11-15 మధ్య భారత్‌లో యాక్టివ్ కేసులు పతాక స్థాయికి చేరే అవకాశం ఉందని చెబుతున్న శాస్త్రవేత్తలు.. ఆ తర్వాత అంతే వేగంగా కేసులు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని, మే నెలాఖరు వరకు గణనీయంగా తగ్గుతాయి అని ఐఐటీ కాన్పూర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ శాఖ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ తెలిపారు. కాగా, హర్యానాలోని అశోక్ యూనివర్సిటీకి చెందిన గౌతమ్ మీనన్ ఆయన బృందం ఏప్రిల్ మధ్య నుంచి మే మధ్యలోగా సెకెండ్ వేవ్ పతాక స్థాయిలో ఉండవచ్చని అంచనా వేసింది.
కాగా, గత ఏడాది కంటే ప్రస్తుతం సెకండ్‌వేవ్ కరోనా తీవ్ర రూపం దాల్చుతుంది. దేశంలో లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారింది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. తీవ్రంగా నమోదవుతున్నాయి. కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. అంతేకాదు కొన్ని రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ కూడా కొనసాగుతోంది.