ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ సబ్ వేరియంట్ BB7 కేసులు గణనీయంగా పెరుగుతుండగానే మరో సబ్ వేరియంట్ పుట్టుకొచ్చింది. ఇప్పుడు కొత్తగా ఉద్భవించిన సబ్ వేరియంట్ XBB1.5 విదేశాలలో ఆందోళనలను కలిగిస్తోంది. కరోనా లెక్కల ప్రకారం ప్రస్తుతం కరోనా XBB1.5 కేసులు సింగపూర్‌లో ఎక్కువగా నమోదవుతున్నాయి. సింగపూర్‌తో పాటు దానికి చుట్టుపక్కల ఉన్న ఆసియా దేశాలలో కూడా ఈ సబ్ వేరియంట్ కేసులు నమోదయినట్లు ఆయా దేశాల వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలోనే నిన్న(డిసెండర్ 31) గుజరాత్‌లో కూడా కరోనా XBB1.5 కేసు నమోదు కావడంతో భారత్‌లో కూడా ఇది ప్రవేశించినట్లయింది. దీనికి సంబంధించిన 10-15 శాతం నమునాలు గుజరాత్‌లో కనిసిస్తున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి.
అయితే ఇప్పటి వరకు నమోదైన సబ్ వేరియంట్లతో పోల్చుకుంటే ఇది 120 రెట్లు వేగవంతంగా వ్యాపిస్తోందని సమాచారం. మరోవైపు గత వారం కాలంలో అమెరికాలో నమోదైన కరోనా కేసులలో 40.5 శాతం XBB.1.5 కేసులే అని ఆరోగ్య నిపుణులు అంచనా. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక ప్రకారం కరోనా సబ్ వేరియంట్ XBB.1.5 గత వారంతో పోలిస్తే ఈ వారం రెట్టింపు అయ్యింది. అందువల్ల దీనిని ‘సూపర్ వేరియంట్’ అని కూడా వారు పిలుస్తున్నారు. ఈ వేరియంట్ మరింతగా వ్యాప్తి చెందుతుందని కొంతమంది ఆరోగ్య నిపుణులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒమిక్రాన్ అనేది కరోనాకు వేరియంట్ అని అందరికీ తెలిసిందే. ఒమిక్రాన్ BA.2.75, BJ.1 సబ్ వేరియంట్ల కలయిక కారణంగా XBB 1.5 ఏర్పడింది. ఇక దీనిని ముందుగా సింగపూర్‌లో గుర్తించారు. ఆ దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరగడానికి ఈ సబ్ వేరియంట్ ప్రధాన కారణమయింది. దీని వ్యాప్తి వేగం మిగిలిన సబ్ వేరియంట్ల కంటే 120 రెట్లు అధికంగా ఉందని పరిశోధకులు అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలలో కేసుల పెరుగుదలకు కారణమవుతున్న ఇతర ఉప వేరియంట్లు భారతదేశంలో కూడా ఉండడానికి అవకాశాలున్నాయని వారు భావిస్తున్నారు. భారత్‌లోనూ అనేక నమూనాలలో కొత్త వేరియంట్ల జాడలు కనిపించాయని చెబుతున్నారు.
ఒమిక్రాన్ XBB 1.5 కేసులు ప్రస్తుతం భారత్‌లో నమోదవుతున్నాయి. ఈ వేరియెంట్ మన దేశంలో విజృంభిస్తే.. మూడు నుంచి నాలుగు వారాల్లో కేసులు మళ్లీ గణనీయంగా పుంజుకునే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇతర ఉప-వేరియంట్‌లపై ఆధిపత్యం అంటే వాటి కంటే వేగంగా వ్యాపించి మానవాళిని ప్రభావితం చేయగల లక్షణాలను XBB 1.5 ప్రదర్శిస్తోందని పలువురు గుర్తించారు. ఇది వ్యాధి నిరోధక వ్యవస్థను ఏమార్చే లక్షణాలను కలిగిన సబ్ వేరియంట్ అని చెబుతున్నారు. అయితే ఈ వేరియంట్ తీవ్రమైన అనారోగ్యానికి కారణమైనట్టు ఎలాంటి ఆధారాలు లేవని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ వేరియంట్ సోకిన వారు వ్యాక్సిన్లు తీసుకోకపోతే ప్రమాదంలో పడతారని, వ్యాక్సిన్లు తీసుకున్న వారికి ఎటువంటి ప్రమాదం ఉండబోదని అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని రాజకీయ వార్తలు చదవండి..