
రైలు ప్రయాణంలో బెర్త్‌లకు సంబంధించిన చిన్న చిన్న విషయాలు కూడా ప్రయాణికుల మధ్య ఇబ్బందులకు కారణమవుతుంటాయి. ముఖ్యంగా స్లీపర్, ఏసీ కోచ్‌లలో ఉండే మిడిల్ బెర్త్ (Middle Berth) విషయంలో తరచూ వివాదాలు జరుగుతుంటాయి. పగటిపూట మధ్య బెర్త్‌ను తెరవడం వల్ల కింది బెర్త్‌లో కూర్చునే ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిస్తుంది. ఈ బెర్త్ వినియోగానికి సంబంధించి రైల్వే కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది.
రైల్వే నిబంధనల ప్రకారం, మధ్య బెర్త్‌ను ప్రధానంగా రాత్రి నిద్ర కోసం మాత్రమే ఉపయోగించాలి. ప్రయాణికులు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మధ్య బెర్త్‌ను తెరిచి పడుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన సమయంలో అంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మధ్య బెర్త్‌ను మడిచి ఉంచాలి. దీంతో కింది బెర్త్‌లో కూర్చునే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.
చాలా మంది ప్రయాణికులు రాత్రి సమయం కాకముందే మధ్య బెర్త్‌ను తెరిచి పడుకోవడం వల్ల కింది బెర్త్ ప్రయాణికులు కూర్చోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సందర్భాల్లో కింది బెర్త్‌లో ఉన్న ప్రయాణికుడు అభ్యంతరం వ్యక్తం చేస్తే, మధ్య బెర్త్‌ను మూసివేయాల్సి ఉంటుంది.
అయితే, నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రత్యేకంగా జరిమానా విధించే నిబంధన లేదని తెలుస్తోంది. కానీ ప్రయాణికుల సౌకర్యం, పరస్పర సహకారం కోసం రైల్వే సూచించిన సమయాలను పాటించడం అవసరం. ప్రయాణంలో ఇలాంటి సమస్యలు ఎదురైతే ప్రయాణికులు సంబంధిత టీటీఈకి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే రైల్వే హెల్ప్‌లైన్ 139 ద్వారా కూడా సహాయం పొందవచ్చు.
రైలు ప్రయాణంలో అందరూ సౌకర్యంగా ఉండేందుకు బెర్త్ వినియోగ నియమాలను పాటించడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్న ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మధ్య బెర్త్ విషయంలో పరస్పర సహకారం అవసరం.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..