India – Myanmar Border: ఈశాన్య కంచె.. మయన్మార్ అక్రమ వలసదారులకు అడ్డుకట్ట.. మణిపూర్ మంటలు ఆర్పేనా?

భారత్ - మయన్మార్ దేశాల మధ్య సరిహద్దులను సూచించే హద్దు రాళ్లు అక్కడక్కడా ఉంటాయి తప్పా, 'కంచె' మాత్రం ఇప్పటి వరకు లేదు. ఆ దేశంతో ఉన్న దౌత్యపరమైన సంబంధాల నేపథ్యంలో కంచెను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. అదే నిత్యం కయ్యానికి కాలుదువ్వే పాకిస్తాన్‌తో సరిహద్దులు కలిగిన దేశ పశ్చిమ ప్రాంతంలో పటిష్టమైన 'కంచె' ఉంది.

India - Myanmar Border: ఈశాన్య కంచె.. మయన్మార్ అక్రమ వలసదారులకు అడ్డుకట్ట.. మణిపూర్ మంటలు ఆర్పేనా?
India Myanmar Fence

Edited By: Balaraju Goud

Updated on: Feb 07, 2024 | 8:09 AM

భారత ప్రభుత్వం దేశానికి ఈశాన్య ప్రాంతంలో మయన్మార్ సరిహద్దుల్లో ‘కంచె’ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. మొత్తం 1,643 కిలోమీటర్ల పొడవున కంచె నిర్మించేందుకు సమాయత్తమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ప్రకటించారు. ఈ ‘కంచె’ భారత్ – మయన్మార్ దేశాలను వేరు చేయనుంది. ఇన్నాళ్లుగా లేనిది.. ఇంకా చెప్పాలంటే చరిత్రలోనే ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారన్నదే ప్రస్తుతం చర్చనీయాంశం.

అవును.. భారత్ – మయన్మార్ దేశాల మధ్య సరిహద్దులను సూచించే హద్దు రాళ్లు అక్కడక్కడా ఉంటాయి తప్పా, ‘కంచె’ మాత్రం ఇప్పటి వరకు లేదు. ఆ దేశంతో ఉన్న దౌత్యపరమైన సంబంధాల నేపథ్యంలో కంచెను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. అదే నిత్యం కయ్యానికి కాలుదువ్వే పాకిస్తాన్‌తో సరిహద్దులు కలిగిన దేశ పశ్చిమ ప్రాంతంలో పటిష్టమైన ‘కంచె’ ఉంది. పాకిస్తాన్ నుంచి పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో ఆ దేశం నుంచి చొరబాట్లకు ఆస్కారం లేకుండా ఉండడం కోసం కంచెను నిర్మించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కంచెకు అటు నుంటి ఇటువైపు భూగర్భంలో సొరంగాలు తవ్వి మరీ అక్రమంగా భారత్‌లోకి చొరబడుతున్న ఘటనలు అడపాదడపా బయటపడుతూనే ఉంటాయి.

ఫ్రీ బోర్డర్ – నో ఫెన్సింగ్

పశ్చిమం సంగతెలా ఉన్నా.. తూర్పు, ఈశాన్య ప్రాంతమే ఇప్పుడు భారతదేశానికి సరికొత్త సమస్యను తెచ్చిపెడుతోంది. నిజానికి అటువైపు పాకిస్తాన్ తరహాలో సీమాంతర ఉగ్రవాదం లేదు. కానీ వేర్పాటువాద శక్తులకు మయన్మార్ ఆశ్రయం కల్పించే వేదికగా మారింది. మరోవైపు మయన్మార్ జుంటా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు సాయుధ తిరుగుబాటు కూడా సాగుతోంది. అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈ సాయుధ గ్రూపులు భారత్‌లోకి చొరబడి ఆశ్రయం పొందుతున్నాయి.

విభిన్న భాషలు, సంస్కృతి సంప్రదాయాలతో కూడిన అనేక తెగలకు నిలయం భారతదేశ ఈశాన్య ప్రాంతం. వాటిలో కొన్ని తెగలు ఇటు భారత్‌లోనూ, అటు మయన్మార్‌లోనూ ఉన్నాయి. ఈ తెగల ప్రజల మధ్య రాకపోకలు సాగుతుంటాయి. ఇలాంటి తెగల ప్రజల మధ్య దేశాల సరిహద్దులు ఇబ్బందులు సృష్టించకూడదు అన్న ఉద్దేశంతో ఆ ప్రాంతంలో ప్రభుత్వం “ఫ్రీ మూమెంట్ రేజీమ్ (FMR)” అమలు చేస్తోంది. తద్వారా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఎలాంటి తనిఖీలు అవసరం లేకుండానే ప్రయాణం సాగించవచ్చు. అంటే పాస్‌పోర్ట్, వీసా లేకుండానే దేశాల సరిహద్దులు దాటేయవచ్చు.

నేపాల్, భూటాన్ దేశాలతో కూడా భారత్ అలాంటి సరిహద్దులనే కలిగి ఉందన్న విషయం తెలిసిందే. అందుకే ఈ దేశాలతో కలిగిన సరిహద్దుల్లోనూ ‘కంచె’ మనకు కనిపించదు. కానీ ఈ ఫ్రీ బోర్డర్ అనేక సమస్యలకు ఆస్కారం కల్గిస్తోంది. దేశ భద్రతకు సంబంధించి ఇదొక పెద్ద ముప్పుగానూ మారుతోంది. భారత్‌లో విధ్వంసమే లక్ష్యంగా పనిచేసే పాకిస్తాన్ ఉగ్రవాదులు నేపాల్ సరిహద్దుల నుంచి భారత్‌లోకి చొరబడిన ఉదంతాలు సైతం చాలానే ఉన్నాయి.

అక్రమ చొరబాట్లతో మారుతున్న డెమోగ్రఫీ

నేపాల్, భూటాన్ బోర్డర్ల సంగతెలా ఉన్నా మయన్మార్ సరిహద్దు రేఖ హిమాలయాల తూర్పు భాగంలో ఎగుడుదిగుడు పర్వతశ్రేణుల మధ్యగా సాగుతుంది. ఈ ప్రాంతం అలవాటైన తెగల ప్రజలు తప్ప ఇతరులు పెద్దగా ఈ ఫ్రీ బోర్డర్ ఉపయోగించుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ ఆయా తెగలే ఇప్పుడు మణిపూర్ వంటి రాష్ట్రంలో అగ్గి రాజేశాయి. రిజర్వేషన్లు, భూమిపై హక్కుల వంటి అంశాల్లో మైటీలు – కుకీ తెగల మధ్య చెలరేగిన హింసాకాండ ఈనాటికీ చల్లారలేదు.

అయితే ఆయా తెగల ప్రజలు రాకపోకలు సాగిస్తూ సంబంధాలు కొనసాగించడం వరకు ఓకే… ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ మయన్మార్‌లో నెలకొన్న అంతర్గత పరిస్థితులు, సైనిక పాలన, ప్రజాస్వామ్యం లేకపోవడం వంటి కారణాలతో ఒకవైపే ఈ ప్రయాణాలు సాగుతున్నాయి. ఫలితంగా ఆయా తెగల ప్రజల సంఖ్య గణనీయంగా పెరిగిపోయి, చివరకు అది తెగల మధ్య ఘర్షణకు దారితీస్తోంది. మణిపూర్‌లోని తెగల్లో మైటీల సంఖ్య అధికం. కానీ రాష్ట్ర భూభాగంలో కేవలం 10 శాతం మాత్రమే ఉన్న మైదాన ప్రాంతాలకే వారు పరిమితం. కుకీలు, నాగా తెగలకు చెందిన ప్రజలు మైటీల కంటే తక్కువ సంఖ్యలో ఉంటారు. కానీ షెడ్యూల్డ్ తెగల జాబితాలో ఉన్నందున వారికి పర్వత ప్రాంతాల్లో ఎక్కడైనా నివసించే హక్కు ఉంది. అంటే రాష్ట్ర భూభాగంలో 90 శాతం భూభాగంపై ప్రత్యేకంగా ఈ తెగలకే హక్కులు ఉండగా, మిగతా 10 శాతం ఉన్న మైదాన ప్రాంతాల్లోనూ వారిని ఏ చట్టం అడ్డుకోలేదు. ఇది మైటీలకు – కుకీలకు మధ్య ఘర్షణకు మూలకారణం.

దీనికి తోడు మయన్మార్ నుంచి విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ చొరబాట్లతో కుకీలు, నాగా తెగల ప్రజల సంఖ్య నానాటికీ పెరుగుతూ పోతోంది. ఇది అక్కడి జనాభాలో జాతుల నిష్పత్తిని మార్చేసింది. అలాగే మైదాన ప్రాంతాలకు పరిమితమైన మైటీలకు కంటగింపుగా మారింది. రాజకీయంగా మైటీలదే ఆధిపత్యమైప్పటికీ.. ప్రభుత్వ ఉద్యోగాల్లో, ఉన్నత పదవుల్లో కుకీల ఆధిపత్యం పెరగడాన్ని ఆ తెగ సహించలేకపోతోంది. మొత్తంగా తెగల మధ్య ఘర్షణకు దారితీస్తున్న ఈ అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేయాలంటే బలమైన ‘కంచె’ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది.

ఇది మాత్రమే కాదు, రోహింగ్యాలుగా పేరొందిన మయన్మార్ దేశంలోని ఒక జాతి ప్రజలు కూడా ఈ ఫ్రీ-బోర్డర్ ద్వారా భారత్‌లోకి ప్రవేశించి జమ్ము, హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అంతర్గత భద్రతకు ముప్పుగా మారుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం కంచె ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకుంది.

‘కంచె’తో గస్తీ ఇక సులభం

ఎలాంటి కంచె లేనిచోట గస్తీ కాయడం కంటే కంచె ఉన్న చోట గస్తీ కచ్చితంగా మెరుగ్గా ఉంటుంది. పైగా ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకోగల్గితే.. ‘కంచె’తో పాటు సీసీటీవీ కెమేరాలు, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అక్రమ చొరబాట్లను గుర్తించి, అడ్డుకోవచ్చు. మయన్మార్ సరిహద్దుల వెంట 1,643 కి.మీ మేర కంచె నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. మొత్తం సరిహద్దులో మణిపూర్‌లోని మోరే ప్రాంతంలో 10 కి.మీ మేర ఇప్పటికే కంచె నిర్మాణం పూర్తయింది. దీనికి తోడు మరో రెండు చోట్ల పైలట్ ప్రాజెక్టు కింద హైబ్రిడ్ సర్వైలెన్స్ సిస్టమ్స్ ఏర్పాటవుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఒకటి అరుణాచల్ ప్రదేశ్‌లో ఉండగా, మరొకటి మణిపూర్‌లో ఉంది. మరో 20 కి.మీ మేర ఫెన్సింగ్ పనులకు ఆమోదం కూడా లభించింది. కంచెను ఏర్పాటు చేయడం ద్వారా ఆయా తెగల ప్రజల మధ్య రాకపోకలను పూర్తిగా నిషేధించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదు. కానీ ఆ రాకపోకలను క్రమబద్దీకరించాలని, ఎవరి కంటా పడకుండా రాకపోకలు సాగించడానికి ఆస్కారం ఇవ్వకూడదని కృతనిశ్చయంతో ఉంది. ఈ కంచెతోనైనా మణిపూర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…