భారత్‌లో వందేభారత్ తరహాలో మరో కొత్త రైళ్లు పట్టాలెక్కనున్నాయి. దేశంలోనే తొలి ర్యాపిడ్ రైలును ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. దేశంలో ఇప్పటికే సెమీ హైస్పీడ్ రైళ్లుగా వందే భారత్ ట్రైన్స్ పరుగులు పెడుతున్నాయి. ఇప్పుడు అంతకంటే వేగంతో ప్రయాణించే రైళ్లతో మరో కొత్త శకం మొదలు కాబోతోంది. ప్రయాణికుల మెరుగైన సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ప్రాజెక్టును రూపొందించింది. దానిలో భాగంగా.. తొలి ర్యాపిడ్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. గంటకు 160 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ రైళ్లలో అనేక అధునాతన వసతులు ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలిసారి ఢిల్లీ-ఘజియాబాద్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్‌లో సాహిబాబాద్-దుహై డిపో మధ్య దూసుకెళ్లనున్నాయి.
నేటి నుంచి ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానుండగా.. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ 17కిలోమీటర్ల పొడవైన ప్రాధాన్యతా విభాగంలో సాహిబాబాద్ నుంచి దుహై డిపో మధ్య ఐదు స్టేషన్ల మీదుగా పరుగులు తీయనున్నాయి. ఈ ర్యాపిడ్ రైళ్లు పూర్తి ఎయిర్ కండిషన్డ్‌గా తయారు చేయడంతోపాటు ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని అనేక ఫీచర్లు ఏర్పాటు చేశారు. ప్రతి ర్యాపిడ్ రైలులో ఒక కోచ్‌ను మహిళల కోసం రిజర్వు చేశారు.
ఈ రైళ్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు ఒకటి చొప్పున సర్వీసులందిస్తాయి. ప్రతి రైలులో ఆరు కోచ్‌లు.. ఏకకాలంలో 1700 మంది కూర్చొని, నిలబడి ప్రయాణించేలా ఏర్పాటు చేశారు. స్టాండర్డ్ కోచ్‌లో 72 సీట్లు, ప్రీమియం కోచ్‌లో 62 సీట్లు చొప్పున ఉంటాయి. ఇక.. స్టాండర్డ్ కోచ్‌లలో కనీస టికెట్ ధర 20 రూపాయలు కాగా.. గరిష్ఠ ధర 50 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే, ప్రీమియం కోచ్‌లలో అయితే కనీస టికెట్ ధర 40 రూపాయలు కాగా.. గరిష్ఠ ధర 100 రూపాయలు నిర్ణయించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..