India-Pakistan Hotline Talk: భారత-పాకిస్తాన్ దేశాల మధ్య సామరస్య వాతావరణం నెలకొనబోతోందా ? ఎన్నడూ లేనిది పాకిస్తాన్ తాజాగా శాంతి జపం పఠించింది. ఇప్పటివరకు జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖ వద్ద కొన్ని వేల సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ కొత్తగా.. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని కోరుతోంది. ఉభయ దేశాల డీజీఎంఓ హాట్ లైన్ ద్వారా జరిగిన చర్చల్లో పాక్ ఇలా తన అభిమతాన్ని వెల్లడించింది. నియంత్రణ రేఖ వద్ద, ఇతర ప్రాంతాల్లోనూ సామరస్య పూరిత వాతావరణం ఏర్పాటుకు సహకరిస్తామని పేర్కొంది. ఇందుకు తన అంగీకారాన్ని తెలిపింది. ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హింసను నివారిస్తామని, శాంతి పరిరక్షణకు తోడ్పడతామని ఈ చర్చల సందర్భంగా హామీ ఇచ్చింది. ఈనెల 24-25 తేదీ రాత్రి నుంచి వాస్తవాధీన రేఖ వద్ద కాల్పుల విరమణ సహా అన్ని ఒప్పందాలకు అనుగుణంగా నడుచుకునేందుకు ఉభయ దేశాలూ అంగీకరించాయి.
ఈ మేరకు ఉభయ దేశాల డైరెక్టర్ జనరల్స్ (ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్) సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. 1987 నుంచి రెండు దేశాల మధ్య హాట్ లైన్ కాంటాక్ట్ ఉందని, తరచూ ఈ సౌకర్యం ద్వారా దీన్ని కొనసాగించాలని పాక్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తేకార్ పేర్కొన్నారని డాన్ వార్తా పత్రిక తెలిపింది. 2014 నుంచి ఎల్ ఓ సీ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాల ఉల్లంఘన పెరుగుతూ వచ్చిందని బాబర్ వ్యాఖ్యానించినట్టు ఈ పత్రిక పేర్కొంది. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని రెండు దేశాల డైరెక్టర్ జనరల్స్ అంగీకరించారు. భారత-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడానికి ఈ చర్చలు దోహదపడగలవని భావిస్తున్నారు.
ఏ అపోహ తలెత్తినా..ఏ అవాంఛనీయ పరిస్థితి ఏర్పడినా హాట్ లైన్ కాంటాక్ట్ ను, బోర్డర్ ఫ్లాగ్ మీటింగ్ ను వినియోగించుకోవాలని కూడా ఈ చర్చల సందర్భంగా అంగీకారానికి వచ్చారు. కాగా-పాక్ తన హామీని నిలబెట్టుకుంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
శీలంకలో రెండు రోజుల పర్యటనకు గాను కొలంబో చేరుకున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఇండియాతో తమకు కేవలం కాశ్మీర్ వివాదమే ఉందని, చర్చల ద్వారా దీన్ని పరిష్కరించుకోవచ్చునని అన్నారు. శ్రీలంక-పాకిస్తాన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన.. 2018 లో తాను తమ దేశ ప్రధానిగా అధికారం స్వీకరించినప్పుడు కాశ్మీర్ పై శాంతి చర్చలు జరుపుదామని కోరానని, కానీ ఇండియా ఇందుకు స్పందించలేదని అన్నారు. భారత ప్రధాని మోదీ తన సూచనకు సమాధానం ఇవ్వలేదన్నారు. ఈ సమావేశంలో శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్షే కూడా పాల్గొన్నారు.
Also Read:
ఫొటోలతో సహా చెలరేగిన సజ్జల, చంద్రబాబు కుప్పం పర్యటన, స్వరూపానందస్వామిపై కామెంట్లకు కౌంటర్ అటాక్
భారత్ – ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రుల భేటి.. పలు ద్వైపాక్షిక సంబంధాలపై ఒప్పందం