
దూసుకెళ్తున్న డిజిటల్ యుగానికి మరింత ఊతం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం మరో ముందుగువేసింది. ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఐఎంల తరహాలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ (IICT)ని ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (AVGC-XR) రంగానికి జాతీయ కేంద్రంగా మారనున్న ఈ సంస్థను గురువారం వేవ్స్ సమ్మిట్ 2025లో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. IICT ఏర్పాటు కోసం ప్రభుత్వం కొన్ని టెక్, మీడియా దిగ్గజాలతో ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో NVIDIA, Google, Apple, Microsoft, Meta, Star India, Adobe వంటి సంస్థలు ఉన్నాయి. ప్రతిష్టాత్మక IIT, IIM తరహాలో FICCI, CIIల వ్యూహాత్మక సహకారంతో IICTని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా స్థాపించింది.
ప్రతిభను పెంపొందించడం, ఆవిష్కరణలను వేగవంతం చేయడం, AVGC-XR రంగంలో ప్రపంచ ప్రమాణాలను ప్రోత్సహించడం ద్వారా సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను మార్చడం ఈ సంస్థ లక్ష్యం. “ఐఐసీటీ వినోద పరిశ్రమకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. దాని విస్తరణకు దోహదపడుతుంది. ప్రధాన మంత్రి మోదీ IICT కోసం రూ.400 కోట్లు కేటాయించారు. మహారాష్ట్ర ప్రభుత్వం భూమిని అందించింది. NVIDIA, Google, Apple, Microsoft, Star India, Meta, Adobe వంటి ప్రపంచ టెక్ దిగ్గజాలు IICTని ప్రపంచ స్థాయి సంస్థగా మార్చడానికి సహకరిస్తున్నాయి. WAVES, IICT ప్రపంచ సృజనాత్మక పర్యావరణ వ్యవస్థలో కీలక కేంద్రంగా ముంబై పాత్రను మరింత బలోపేతం చేస్తాయి” అని మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. IICT మొదటి దశ ముంబైలోని పెడ్డర్ రోడ్‌లోని NFDC భవనంలో ఉంది.
గేమింగ్ ల్యాబ్‌లు, యానిమేషన్ ల్యాబ్‌లు, ఎడిట్, సౌండ్ సూట్‌లు, వర్చువల్ ప్రొడక్షన్ సెటప్‌లు, ఇమ్మర్సివ్ స్టూడియోలు, ప్రివ్యూ థియేటర్, బహుళ స్మార్ట్ తరగతి గదులు వంటి అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉంది. గోరేగావ్‌లోని ఫిల్మ్ సిటీలో 2వ దశలో 10 ఎకరాల ప్రత్యేక క్యాంపస్ అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా సృజనాత్మక పర్యావరణ వ్యవస్థలను వికేంద్రీకరించడానికి, పెంపొందించడానికి ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని పేర్కొన్నారు. శిక్షణ, ఇంక్యుబేషన్, ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధిపై దృష్టి సారించి మన దేశంలోని యువ సృష్టికర్తలు, సాంకేతిక నిపుణులు, వ్యవస్థాపకులకు లెక్కలేనన్ని అవకాశాలను సృష్టించడానికి IICT సిద్ధంగా ఉందని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి