
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ వాస్తవ జీడీపీ (GDP) 7.8 శాతం వృద్ధి నమోదు చేయడం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి, దేశ ఆర్థిక వ్యవస్థ బలానికి నిదర్శనమని పేర్కొన్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన 6.9 శాతం వృద్ధితో పోలిస్తే, 2026-27 తొలి త్రైమాసికంలో GDP వృద్ధి 7.8 శాతానికి పెరిగిందని కిషన్‌రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ అనిశ్చితులు, చమురు ధరల ఒడిదుడుకులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఉన్నప్పటికీ భారత్ ఈ స్థాయి వృద్ధిని సాధించడం కీలక పరిణామమని అన్నారు. తొలి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి సాధించడం గొప్ప విజయమని, ఇది ప్రధాని మోదీ నిర్ణయాత్మక విధానాలపై ఏర్పడిన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
దేశ ఆర్థిక వృద్ధి ఒక్క రంగానికే పరిమితం కాలేదని మంత్రి తెలిపారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు 3.6 శాతం వృద్ధిని నమోదు చేయగా, సెకండరీ సెక్టార్ ఏకంగా 8.6 శాతం వృద్ధి సాధించిందన్నారు. సర్వీసెస్ రంగం 10 శాతం వృద్ధితో మరింత ముందంజలో ఉందని తెలిపారు. ముఖ్యంగా ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ఐటీ, ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగాలు 12.1 శాతం వృద్ధిని నమోదు చేయడం సేవల రంగానికి ఊతమిచ్చిందని చెప్పారు.
ఎల్‌నినో ప్రభావం సహా ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య కూడా వ్యవసాయ రంగం 3.6 శాతం వృద్ధిని సాధించడం సానుకూల పరిణామమని కిషన్‌రెడ్డి అన్నారు. సాగు కార్యకలాపాలు, విత్తనాల వేయడం వంటి ప్రక్రియలు కొనసాగుతున్న నేపథ్యంలో రెండో, మూడో త్రైమాసికాల్లో వ్యవసాయ రంగం మరింత మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మౌలిక వసతులు, తయారీ, వ్యవసాయం, సేవలు, పెట్టుబడులు, డిజిటలైజేషన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై కేంద్ర ప్రభుత్వం పెట్టిన దృష్టి ఫలితంగానే ఆర్థిక వ్యవస్థ బలపడుతోందని మంత్రి అన్నారు. భారత్ పురోగతిని విమర్శించే వారికి తాజా GDP గణాంకాలు సమాధానమని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయ కథనాల కంటే గణాంకాలు బలంగా మాట్లాడతాయి అని పేర్కొంటూ, దేశ ఆర్థిక పురోగతిని తక్కువ చేసి చూపించే ప్రయత్నాలకు 7.8 శాతం వృద్ధి తగిన సమాధానమని అన్నారు.
దేశీయ డిమాండ్, మౌలిక వసతుల అభివృద్ధి, సంస్కరణలు, వ్యవసాయ రంగం మెరుగైన పనితీరు కొనసాగితే భారత్ అధిక వృద్ధి బాటలోనే కొనసాగుతుందని కిషన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. 7.8 శాతం వృద్ధి ఒక్క త్రైమాసిక విజయమే కాదని, 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న ప్రధాని మోదీ లక్ష్యానికి ఇది మరో కీలక అడుగు అని పేర్కొన్నారు.