China Pangong Lake: శృతిమించుతోన్న చైనా ఆగడాలు.. సీరియస్‌గా స్పందించిన భారత్..

|

May 21, 2022 | 9:31 AM

China Pangong Lake: తూర్పు లద్దాఖ్‌లో చైనా ఆగడాలు శృతి మించడంతో భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాంగాంగ్‌ సరస్సు దగ్గర రెండో వంతెన..

China Pangong Lake: శృతిమించుతోన్న చైనా ఆగడాలు.. సీరియస్‌గా స్పందించిన భారత్..
China Pangong Lake
Follow us on

China Pangong Lake: తూర్పు లద్దాఖ్‌లో చైనా ఆగడాలు శృతి మించడంతో భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాంగాంగ్‌ సరస్సు దగ్గర రెండో వంతెన నిర్మాణంపై విదేశాంగశాఖ మండిపడింది. పాంగాంగ్‌ సరస్సుపై చైనా రెండో వంతెనను నిర్మించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. చైనా తాము ఆక్రమించిన భూభాగంలో ఈ నిర్మాణాలను చేపట్టినట్టు భారత్‌ ఆక్షేపించింది. ఈ ప్రాంతం 1960 నుంచి చైనా దురాక్రమణలో ఉన్నట్టు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించడాన్ని ఎప్పటికి గుర్తించే ప్రసక్తే లేదని విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బగ్చీ తెలిపారు.

గతంలో అక్రమంగా నిర్మించిన వంతెన పక్కనే చైనా కొత్త వంతెన నిర్మించినట్టు తమ దృష్టికి వచ్చినట్టు వెల్లడించారు. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్‌ , లద్దాఖ్‌లు ముమ్మాటికి భారత్‌లో అంతర్భాగమని చైనా దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినట్టు విదేశాంగశాఖ స్పష్టం చేసింది. చైనాతో ఇటీవల జరిగిన చర్చల్లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలిపింది. భారత సార్వభౌత్యాన్ని చైనా గుర్తించాల్సిందేనని తేల్చి చెప్పింది. చైనా సరిహద్దు ప్రాంతాల్లో చాలా అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్టు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. వంతెనలు , రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసినట్టు వివరించింది.

సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ది కార్యక్రమాలు కేవలం మిలటరీ అవసరాల కోసమే కాకుండా స్థానికుల ఆర్ధికాభివృద్దికి దోహదం చేస్తాయని విదేశాంగశాఖ వెల్లడించింది. ఎట్టి పరిస్థితుల్లో తూర్పు లద్దాఖ్‌లో భారత భూభాగాన్ని కాపాడుకుంటామని విదేశాంగశాఖ స్పష్టం చేసింది. చైనా మాత్ర చర్చల పేరుతో టైంపాస్‌ చేస్తూ డబుల్‌గేమ్‌ ఆడుతోంది. అందుకే డ్రాగన్‌ కుట్రలను అదే రీతిలో తిప్పికొట్టేందుకు భారత్‌ రెడీ అవుతోంది. తూర్పు లద్దాఖ్‌లో రెండు దేశాల బలగాలను తగ్గించాలని ఎప్పటినుంచో ప్రతిపాదనను చైనా ముందుపెట్టింది. బలగాల ఉపసంహరణపై తగ్గినట్టే తగ్గి మళ్లీ చైనా కవ్వింపులకు పాల్పడుతోంది.