ఇండియా కూటమి అవినీతి, దేశ వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్‌లోని నవాడాలో పర్యటించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ఇండియా కూటమి, కాంగ్రెస్, ఆర్జేడీలను టార్గెట్ చేశారు. ఖర్గే జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశంలో భాగంగా పరిగణించలేదా? అని ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, ఖర్గే ప్రసంగం దేశ వ్యతిరేకుల ప్రసంగంలా ఉందన్నారు మోదీ. ఇండియా కూటమి విద్వేషాలు, దేశ వ్యతిరేక శక్తులకు నిలయమని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలోని కీలక నేతల్లో ఒకరు తమను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేంత వరకు ఎన్నికల ప్రచారానికి వెళ్లబోమని తేల్చి చెప్పారన్నారు.
సనాతన ధర్మాన్ని అంతం చేయడం గురించి ఇండియా కూటమిలో ఉన్నవారు మాట్లాడుతున్నారని ఆరోపించారు. భారతదేశం మరొక విభజకు గురి అయ్యేలా వీరి చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. ఒక్కటిగా ఉన్న దేశాన్ని దక్షిణ భారతదేశంగా విడదీయడంపై కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రామమందిరాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందన్నారు. మీలాగే తాను పేదరికం నుంచి ఈ స్థాయికి వచ్చానని గుర్తు చేశారు. పేదల కొడుకు, పేదల సేవకుడైన మోదీ.. దేశంలోని ప్రతి అన్నదమ్ముల పేదరికాన్ని పారద్రోలే వరకు శ్రమిస్తూనే ఉంటానని హామీ ఇచ్చారు. మోడీ హామీలు ఇండియా కూటమికి మింగుడు పడటం లేదని, మోడీ హామీలను కాంగ్రెస్ నేత వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. కానీ మోదీ హామీ ఇస్తే దానిని నెరవేర్చే దిశగా ఎప్పుడూ పనిచేస్తారని ప్రజలకు తెలిపారు. దీనిపై ఇండియా కూటమిలోని నేతలకు విశ్వసం లేదన్నారు. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..