India-Canada: ట్రూడో ఆరోపణలపై భారత్ ఫైర్.. 5 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలంటూ కెనడా దౌత్యవేత్తకు హుకూం..

|

Sep 19, 2023 | 1:51 PM

India Canada Relations: కెనడాలో సిక్కు నేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య తరువాత భారత్ - కెనడా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారింది. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్య అయిన కొన్ని నెలల తర్వాత, ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో సోమవారం సంచలన ప్రకటన చేశారు. ఈ ఘోరమైన కాల్పుల వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందంటూ ఆరోపించారు.

India-Canada: ట్రూడో ఆరోపణలపై భారత్ ఫైర్.. 5 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలంటూ కెనడా దౌత్యవేత్తకు హుకూం..
Justin Trudeau, PM Modi
Follow us on

India Canada Relations: కెనడాలో సిక్కు నేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య తరువాత భారత్ – కెనడా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారింది. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్య అయిన కొన్ని నెలల తర్వాత, ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో సోమవారం సంచలన ప్రకటన చేశారు. ఈ ఘోరమైన కాల్పుల వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందంటూ ఆరోపించారు. ఖలిస్థాన్ కుంపట్లు కాస్తా.. తీవ్ర ఆరోపణలకు దారితీశాయి. భారత ప్రభుత్వమే ఈ హత్య చేయించిందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపణల తరువాత.. భారత రాయబార కార్యాలయ ఉద్యోగి, భారత దౌత్యవేత్త పవన్ కుమార్ రాయ్‌ ను కెనడా బహిష్కరించింది. కెనడా ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్.. ఖలిస్థానీ టెర్రరిస్ట్ హత్యతో తమకు సంబంధం లేదంటూ స్పష్టంచేసింది. అంతేకాకుండా కెనడాకు ధీటైన సమాధానమిచ్చింది. కెనడా ప్రధాని ఆరోపణల తరువాత కేంద్రం మంగళవారం ఉదయం కెనడా హైకమిషనర్ కెమెరూన్ మాకేని పిలిపించింది. కెనడా తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసిన భారత్.. ఐదు రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని భారత్ లోని దౌత్యవేత్తకు సూచించింది. కెనడా దౌత్యవేత్త భారత అంతర్గత రాజకీయాలలో జోక్యం చేసుకున్నారని ఆరోపించింది. అంతకుముందు, కెనడా భారత దౌత్యవేత్త పవన్ కుమార్ రాయ్‌ను బహిష్కరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కెనడా భారత అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుందని.. దౌత్యవేత్తలు కూడా భారత వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని కూడా కేంద్రం ఆగ్రహం వ్యక్తంచేసింది. వాస్తవానికి కెనడా హైకమిషనర్‌ను భారత్ పిలిపించింది. దీని తరువాత, భారతదేశం ఒక సీనియర్ కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. ఈ నిర్ణయం గురించి కెనడా హైకమిషనర్‌కు తెలియజేసింది. సంబంధిత దౌత్యవేత్తను వచ్చే ఐదు రోజుల్లో భారత్ విడిచి వెళ్లాలని కోరినట్లు తెలుస్తోంది.

కెనడా ప్రధాని ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించడంతోపాటు.. రాజకీయ ప్రముఖులు “అటువంటి అంశాల” పట్ల బహిరంగంగా సానుభూతి వ్యక్తం చేయడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది. “కెనడాలో ఆశ్రయం కల్పించి, భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు ముప్పును కొనసాగిస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాదులు, తీవ్రవాదుల నుంచి దృష్టి మరల్చడానికి ఇటువంటి నిరాధార ఆరోపణలు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో కెనడా ప్రభుత్వం దుష్ట వైఖరి చాలా కాలంగా.. ఆందోళనగా మారింది” అంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. హత్యలు, మానవ అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలతో సహా అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు కెనడాలో కొత్తవి కాదని ప్రకటనలో పేర్కొంది. కెనడా నుంచి పనిచేస్తున్న అన్ని “భారత వ్యతిరేక అంశాల”పై సత్వర చర్య తీసుకోవాలని కోరింది.

ఖలిస్తానీ టైగర్ ఫోర్స్, సిక్ ఫర్ జస్టిస్ (SFJ) కెనడియన్ విభాగానికి నేతృత్వం వహించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ జూన్‌లో సర్రేలోని గురుద్వారా సమీపంలో గుర్తు తెలియని దుండగులచే కాల్చి చంపబడ్డాడు. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన నిజ్జర్ 1997లో కెనడాకు వెళ్లాడు. భారతదేశంలో నియమించబడిన టెర్రర్ గ్రూప్ అయిన ఖలిస్తానీ టైగర్ ఫోర్స్‌కు “మాస్టర్ మైండ్”గా ఉన్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం