
ఏదైనా వస్తువు కొత్తగా మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని విశిష్టతల గురించి ఎన్నో రకాలుగా ప్రచారం, ప్రమోషన్ చేస్తుంటారు. ఎన్ని చేసినా సరే.. దాని పనితీరు గురించి ఓ నలుగురి నుంచి ఫీడ్‌బ్యాక్ లేదా స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతగానీ వినియోగదారుడికి నమ్మకం కలగదు. ఇప్పుడు మన బ్రహ్మోస్ క్షిపణుల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే కొద్ది నెలల క్రితం పాకిస్తాన్‌తో భారతదేశం జరిపిన “ఆపరేషన్ సింధూర్” బ్రహ్మోస్ క్షిపణులకు టెస్ట్ డ్రైవ్ మాదిరిగా మారింది. వాటి పనితీరును యావత్ ప్రపంచం ప్రత్యక్షంగా వీక్షించింది. వాటి కచ్చితత్వం, సృష్టించిన విధ్వంసానికి వేరే ఏ సాక్ష్యం అవసరం లేదు.
ఇదే ఇప్పుడు ఆ క్షిపణికి డిమాండ్ తెచ్చి పెడుతున్నాయి. అనేక దేశాలు ఇప్పుడు ఆ క్షిపణులను కొనుగోలు చేసేందుకు భారతదేశంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇప్పటికే.. ఫిలిప్పీన్స్ – భారత్ మధ్య ఒప్పందం కుదరగా, ఇప్పుడు తాజాగా ఇండోనేషియా కూడా బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు దాదాపుగా కొలిక్కివచ్చి ఒప్పందం కుదుర్చుకునే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మోస్ ప్రత్యేకతలను ఓసారి పరిశీలిస్తే..
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ప్రత్యేకలు
ఫిలిప్పీన్స్‌తో ₹3500 కోట్ల ఒప్పందం
కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశం ఫిలిప్పీన్స్‌తో సుమారు ₹3500 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ప్రకారం క్షిపణులు, అవసరమైన ఇతర ఆయుధ వ్యవస్థలను అందిస్తుంది. ఈ ఒప్పందాన్ని అంతర్జాతీయంగా నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే, ఈ ప్రాంతంలో తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఫిలిప్పీన్స్ తమ రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది.
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి కోసం అనేక దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఇండోనేషియా చాలా కాలంగా చర్చలు జరుపుతోంది. ఈ ఏడాది జనవరిలో ఇండోనేషియాకు చెందిన అత్యున్నత రాజకీయ, సైనిక నాయకత్వం న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో బ్రహ్మోస్ గురించి చర్చించింది. తర్వాత జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ ఆ దేశానికి మరింత నమ్మకాన్ని కలిగించింది.
మరోవైపు భారతదేశం ఇప్పటికే ఫిలిప్పీన్స్‌కు క్షిపణులను విక్రయిస్తోంది. ఈ ప్రత్యేకమైన ఆయుధ వ్యవస్థ మార్కెట్‌ను ఇప్పుడు మరింత విస్తరించాలని భారత్ భావిస్తోంది. ఇటీవల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సహా సీనియర్ భారత సైనికాధికారులు ఇండోనేషియాను సందర్శించారు. CDS ఇండోనేషియా పర్యటన భారతదేశం – ఇండోనేషియా మధ్య పెరుగుతున్న రక్షణ సంబంధాన్ని సూచిస్తుంది. జనవరిలో అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో చేపట్టిన భారత పర్యటన కూడా భారత్ – ఇండోనేషియా సైన్యాల మధ్య సన్నిహిత సహకారానికి మార్గాన్ని సుగమం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.