Pubg Game: ఆన్‌లైన్ గేమ్ పబ్ జీ యావత్ ప్రపంచానే ఊపేస్తున్న విషయం తెలిసిందే. చిన్న పిల్లల నుంచి యువత వరకు అందరూ పబ్ జీ మోజులో పడిపోయారు. పబ్ జీ ఆడుతూ సమయాన్నే మర్చిపోతున్నారు. అయితే, ఈ పబ్‌జీ గేమ్ కారణంగా చాలా మంది పిల్లలు, యువత తమ ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. తాజాగా ఓ ఇంట్లో కూడా పబ్ జీ పెను విషాదాన్ని నింపింది. కొడుకు ఆడుతున్న పబ్ జీ గేమ్ కారణంగా అతని తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన కర్ణాటకలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక చిక్కమగళూరు తాలుకాలోని హగలఖాన్ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన ఇంతియాజ్, మైమున దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
వీరిలో చిన్న కుమారుడు పబ్ జీ గేమ్‌కు బానిస అయ్యాడు. ప్రతి రోజూ నిద్ర లేచింది మొదలు.. పబ్ జీ గేమ్ ఆడుతూ ఉండేవాడు. దాంతో ఆగ్రహించిన అతని తండ్రి.. పబ్ జీ ఆడొద్దంటూ పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ అతను మారకపోవడంతో.. తాజాగా తండ్రీ కొడుకుల మధ్య పబ్ జీ కోసం వాగ్వాదం జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఇంతియాజ్.. పబ్ జీ ఆడకపోతే తుపాకీతో కాల్చి చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఏకంగా తుపాకీ తీసుకురావడంతో భయపడిపోయిన ఇంతియాజ్ భార్య.. కొడుక్కి అడ్డుగా వెళ్లింది. అయితే, ఫుల్లుగా మద్యం సేవించిన ఇంతియాజ్ తుపాకీతో కాల్చాడు. దాంతో మైమునకు బుల్లెట్ తగిలింది. తీవ్రంగా రక్తస్త్రావం అవుతుండటంతో అలర్ట్ అయిన కుటుంబ సభ్యులు.. ఆస్పత్రికి తరలించారు. అయితే, మైమున అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.