Petrol and Diesel Rates: ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. పెట్రో ధరల బాదుడు షురూ.. అసలేం జరుగుతోందంటే..!

Petrol and Diesel Rates: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో మళ్లీ పెరుగుదల మొదలైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సహా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు...

Petrol and Diesel Rates: ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. పెట్రో ధరల బాదుడు షురూ.. అసలేం జరుగుతోందంటే..!
Fuel Price
Follow us
Shiva Prajapati

|

Updated on: May 05, 2021 | 1:39 PM

Petrol and Diesel Rates: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో మళ్లీ పెరుగుదల మొదలైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సహా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు ముగియడంపై మళ్లీ చమురు ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. మళ్లీ పెరుగుతున్న ఇంధన ధరలు చూసి ప్రజలు లబోదిబోమంటున్నారు. చివరిసారిగా ఏప్రిల్ 24వ తేదీన లీటర్‌ పెట్రోల్‌ పై 14, డీజీల్‌ పై 13 పైసలు పెరిగింది. ఆ తరువాత నుంచి పెట్రోల్, డీజీల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే, తాజాగా పెట్రోల్‌‌పై లీటరుకు 17 పైసలు, డీజీల్ పై లీటరుకు 20 పైసలు చొప్పున పెంచారు.

హైదరాబాద్‌లో పెరిగిన తాజా ధరలతో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. పెట్రోల్‌ లీటర్‌ రూ.94.16, డీజీల్‌ లీటర్‌ రూ.88.25 గా ఉంది. చివరిసారిగా గత నెల 15 న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించారు. పెట్రోల్‌పై 16 పైసలు, డీజీల్‌పై 14 పైసలు తగ్గించారు. ఆ తరువాత మళ్లీ ఇప్పుడే చమురు ధరలు పెరిగాయి. ఈ ఏడాది మార్చి 24 నుంచి మంగళవారం(మే 4) వరకు పెట్రోల్ పై లీటరుకు 77 పైసలు, డీజిల్‌ పై లీటరుకు 74 పైసలు తగ్గించారు. అదే సమయంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 23వ తేదీ వరకు పెట్రోల్‌ ధర లీటరుకు రూ. 7.46, డీజీల్‌ ధర లీటరుకు రూ. 7.60 పెంచారు.

భారతీయ చమురు కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం కంపెనీలు దేశంలో ప్రతీ రోజూ ఉదయం 6 గంటలకు సవరించిన ధరలను ప్రకటిస్తున్నాయి. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్, ఆయా రాష్ట్రాలు విధించే పన్నుల ఆధారంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా పెట్రోల్, డీజిల్ ధరలు ఉంటున్నాయి. అయితే, తాజాగా ఎన్నికలు ముగియడం.. చమురు ధరలు మళ్లీ పెరగడం చూస్తుంటే.. పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ కొట్టడం ఖాయంగా కనిపిస్తోందని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. మనదేశంలో పెట్రోల్, డీజిల్ మూల ధరల కన్నా పన్నుల భారమే ఎక్కువగా ఉంది. 2018, అక్టోబర్4న ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర ఆల్‌ టైమ్ హైలో రూ.84 నమోదువగా.. అదే రోజు డీజిల్ రేటు అంతేస్థాయిలో లీటరుకు రూ.75.45 పలికింది. ఇక 2020 మే నుంచి లీటరు పెట్రోల్‌‌‌‌పై రూ.14.79 పెరుగుదల నమోదవగా.. లీటరు డీజిల్‌‌‌‌పై రూ.12.34 ధర పెరుగుదల నమోదైంది.

గతంలో చమురు ధరలు ఎలా ఉండేదంటే.. గతంలో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రభుత్వ నియంత్రణలోనే ఉండేవి. చమురు కంపెనీల అభ్యర్థనను బట్టి ప్రభుత్వాలు ధరలు పెంచేవి. అలా రెండుమూడు నెలలకు ఒకసారి ధరలు పెరిగేవి. 2004లో పెట్రోల్ ధరల నియంత్రణను యూపీఏ ప్రభుత్వం ఎత్తివేసింది. చమురు సంస్థలే స్వయంగా నిర్ణయం తీసుకోవచ్చని సూచించింది. అయితే, డీజిల్ ధరలు మాత్రం ప్రభుత్వం నియంత్రణలోనే ఉన్నాయి. ఇక 2014 అక్టోబర్‌లో డీజిల్ ధరలపై కూడా నియంత్రణను ఎత్తేసింది కేంద్ర ప్రభుత్వం.

2017 జూన్‌కి ముందు 15 రోజులకొసారి చమురు ధరల సవరణలు జరిగేవి. 2017 జూన్ నుంచి రోజువారీగా ధరల సవరణ విధానం అమల్లోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి చమురు ధరలు రోజు వారీగా మారుతున్నాయి. దాంతో తెలియకుండానే పెట్రోల్, డీజిల్ ధరలు భారీ స్థాయిలో పెరగడంతో పాటు.. ప్రజలకు విపరీతంగా ధరల భారం మోపుతున్నారు. ఇక, 2014 మే లో భారత ప్రధాన మంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసే నాటికి దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర రూ.71.41 ఉండగా.. అప్పుడు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర గరిష్ట స్థాయిలో 106.85 అమెరికన్ డాలర్లుగా ఉంది. కానీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర భారీగా తగ్గినప్పటికీ.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి.

దేశ వ్యాప్తంగా ఆందోళనలు… పెట్రోల్ ధరలు పెంపును వ్యతిరేకిస్తూ రాష్ట్రాల్లో ఆందోళన తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు చేస్తున్నాయి. చమురు ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని మోదీని రాహుల్ గాంధీ కోరారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ధరలు తగ్గించాలని కోరారు.

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఇలా ఉన్నాయి.. 2021లో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర 2014తో పోలిస్తే సగానికి తగ్గింది. అయినా భారత్‌లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. అంతర్జాతీయంగా ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 48 అమెరికన్ డాలర్లు ఉండగా.. అది భారత కరెన్సీలోకి మారిస్తే రూ. 3,525 గా ఉంది. ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ అంటే 159 లీటర్లు ఉంటుంది. ఆ లెక్కన చూసినట్లయితే.. ఒక లీటర్ క్రూడ్ ఆయిల్‌ మనకు రూ. 22.16 పడుతోంది.

ఇక పెరుగుతూనే ఉంటాయట.. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఇక పెరుగుతూనే ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర అంతర్జాతీయంగా 47 సెంట్స్ పెరిగింది. బ్యారల్‌కి 57.05 డాలర్లను అధిగమించింది. కిందటి సెషన్ ‌‌‌తో పోలిస్తే ఇది 1.7 శాతం ఎక్కువ. ఇదిలాఉంటే.. ఇంతకుముందు 484.5 మిలియన్ బ్యారల్స్‌‌‌‌గా ఉన్న ఇన్వెంటరీలు.. 5.8 మిలియన్ బ్యారల్ వరకు క్రూడ్ ఇన్వెంటరీలు తగ్గాయి. ఆయిల్ ధరలను బ్యాలన్స్ చేసేందుకు సౌదీ అరేబియా ఈ ఎత్తు వేసినట్లు నిపుణులు చెబుతున్నారు. ఉత్పత్తికి కోత పెట్టడం ద్వారా ధరలు బ్యాలన్స్ చేయొచ్చని సౌదీ అరేబియా ప్లాన్ వేస్తోందంటున్నారు. కరోనా సమయంలో ఆయిల్ డిమాండ్ భారీగా తగ్గింది. అదే సమయంలో మార్కెట్లోకి ఆయిల్ ఓవర్‌‌‌‌‌‌‌‌ సప్లయి అయింది. దాంతో ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా భారీగా తగ్గాయి. ఇప్పుడు ఉత్పత్తి తగ్గడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. రానున్న కొద్ది రోజుల పాటు ధరల పెంపు కొనసాగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

దేశంలో టాక్స్ లు ఎంతంటే.. దేశంలో చమురు ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. అందుకే ధరలు పెరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది. లీటర్ పెట్రోల్ ధర రూ. 31 ఉండగా.. కేంద్రం విధిస్తున్న పన్నులు రూ. 32 ఉంది. క్రూడ్ ఆయిల్ ప్రాసెసింగ్, మార్జిన్లు, ట్రాన్స్‌పోర్టు సహా ఖర్చులు.. పెట్రోలు సరఫరాకు ప్రభుత్వానికి అయ్యే ఖర్చు లీటర్ కు 25.62 రూపాయలు. డీజిల్ కు 27.04 రూపాయలు. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ, రోడ్డు సెస్‌ల పేరుతో వేస్తున్న భారం లీటర్ పెట్రోల్ కు రూ.32.98, డీజిల్ కు 31.83 రూపాయలు. (బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి 2014లో ఈ పన్నుల భారం పెట్రోల్ పై 9.20 రూపాయలు, డీజిల్ పై 3.46 రూపాయలు మాత్రమే). ఇక డీలర్ కమిషన్ – పెట్రోల్ పై లీటర్ కు రూ.3.6, డీజిల్ కు రూ. 2.53. మరోవైపు వ్యాట్ పేరుతో దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు మరో 30 శాతం పన్నులు వడ్డిస్తున్నాయి.

ఏపీ, తెలంగాణలలో వ్యాట్ వడ్డింపులు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పెట్రోల్ పై 35.20 శాతం, డీజిల్ పై 27 శాతం వ్యాట్ పేరుతో పన్నులు విధిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం సెప్టెంబరులో “రోడ్డు అభివృద్ధి పన్ను’’ పేరుతో పెట్రోల్, డీజిల్ పై 1 రూపాయి అదనపు భారం వేసింది. కాగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94..54, డీజిల్ రూ. 88.69 లకు చేరింది.

ఇష్టారీతిన రేట్ల పెంపు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఏర్పాటైన తరువాత ఎక్సైజ్‌ సుంకం గత 6 సంవత్సరాలలో 15 సార్లు సవరించింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పడు పెంచాలి, తగ్గినప్పుడు తగ్గించాలి అనే విధానానికి తూట్లు పొడిస్తూ వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు పెంచుతూ, తగ్గినప్పుడు మాత్రం తగ్గించకుండా ఎక్సైజ్‌ డ్యూటీని పెంచివేస్తూ ప్రజలపై విపరీతమైన భారం మోపుతూ వస్తోంది. బీజేపీ ప్రభుత్వం గత ఆరేళ్లలో పెట్రోలు, డీజిల్‌పై పన్నులు పెంచడం ద్వారా సుమారు రూ. 11 లక్షల కోట్ల ఆదాయం సంపాదించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

పెట్రోల్, డీజిల్‌పై అత్యధిక టాక్సులు విధిస్తున్న దేశాలు ఇవే.. భారత్ లో 69 శాతం ఇటలీ 64 శాతం ఫ్రాన్స్ 63 శాతం జర్మనీ 63 శాతం బ్రిటన్ 62 శాతం స్పెయిన్ 53 శాతం జపాన్ 47 శాతం కెనడా 33 శాతం అమెరికా 19 శాతం

ఆయిల్ కంపెనీల డిమాండ్.. ఆయిల్, గ్యాస్ స్టాక్స్‌కు దేశ వ్యాప్తంగా విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌కు 4 శాతం వరకు ఆయిల్ డిమాండ్ పెరిగింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ కు 3.77 శాతం వరకు డిమాండ్ పెరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు 2.45 శాతం వరకు డిమాండ్ పెరగగా.. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ కు 1.82 శాతం వరకు డిమాండ్ పెరిగింది. గెయిల్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ లకు కూడా డిమాండ్ పెరిగింది. ట్రోనెట్ ఎల్‌‌‌‌ఎన్‌‌‌‌జీ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కు సైతం డిమాండ్ పెరిగింది.

Also read:

Kamal Hassan Review: ఓటమిపై రివ్యూ స్టార్ట్ చేసిన లోకనాయకుడు.. కలత చెందొద్దు కఠినంగా పనిచేయాలన్న హీరో

మెదక్‌ జిల్లాలో ఆసక్తిగా మారిన ఆన్‌లైన్‌ పెళ్లి.. ఆన్‌లోనే మంత్రాలు చదివి పెళ్లి జరిపించిన పురోహితులు