కానిస్టేబుల్‌ భార్య, కుమారుడిని.. కత్తితో పొడిచి చంపిన అతడి ప్రియురాలు!

Constable Lover Killed His Wife and Son: ఓ కానిస్టేబుల్‌ ఆడిన మూడు ముక్కలాట బెడిసి కొట్టి అతడి కుటుంబాన్ని నాశనం చేసింది. అతడి ప్రియురాలు ఒకే రోజు అతడి భార్య, ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. అతడి ఇద్దరు కుమార్తెలు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ షాకింగ్‌ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లాలో శనివారం (ఏప్రిల్ 25) ఉదయం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

కానిస్టేబుల్‌ భార్య, కుమారుడిని.. కత్తితో పొడిచి చంపిన అతడి ప్రియురాలు!
Constable Lover Killed His Wife And Son In Chhattisgarh

Updated on: Apr 26, 2026 | 6:16 AM

రాయ్‌పూర్‌, ఏప్రిల్ 26: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కానిస్టేబుల్ లలితేష్ యాదవ్ ప్రియురాలైన సరోజిని భరద్వాజ్ (25) శనివారం ఉదయం దుర్గ్‌లోని అతడి ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో కానిస్టేబుల్‌ లలితేష్‌ ఇంట్లో లేడు. ఊరు వెళ్లేందుకు తన కుటుంబం కోసం రైల్వే టిక్కెట్లు కొనడానికి రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. అతడి ఇంటికి చేరుకున్న సరోజిని భరద్వాజ్ కానిస్టేబుల్‌ భార్య రీనాతో తొలుత వాగ్వాదానికి దిగింది. గొడవ బయటకు వినిపించకుండా టీవీ సౌండ్‌ కూడా పెంచింది. ఆ తర్వాత ఓ కత్తిని తీసుకుని కానిస్టేబుల్‌ భార్య రీనా, ఆమె ముగ్గురు పిల్లలపై సరోజినీ భరద్వాజ్‌ కత్తితో దాడి చేసింది. తొలుత నిద్రిస్తున్న రీనా కుమరుడు ఆదిత్య (9)ను కత్తితో దారుణంగా పొడిచింది. కుమార్తెలు నైనా, తానియాపై కూడా సరోజిని కత్తితో దాడి చేస్తుండగా రీనా ఆమె కాళ్లు పట్టుకుని తన పిల్లలను వదిలిపెట్టమని వేడుకుంది. కుమార్తెలను పారిపోమని చెప్పింది. దీంతో ఒక కుమార్తె బాత్‌రూమ్‌లో దాక్కోగా, మరో కుమార్తె తప్పించుకుని బయటకు పరుగులు తీసింది. ఈ క్రమంలో రీనాను సరోజిని పలుమార్లు కత్తితో పొడిచింది. దారుణంగా గాయపడిన రీనా, ఆమె కుమారుడు ఆదిత్య అక్కడికక్కడే రక్తం మడుగులో ప్రాణాలు వదిలారు.

మరోవైపు బయటకు పరుగులు తీసిన రీనా కుమార్తె అక్కడి ఇతర ఫ్లాట్‌లలోని వారిని విషయం చెప్పడంతో.. వారంతా పరుగున వచ్చారు. వారంతా ఫ్లాట్‌కు పరుగెత్తుకెళ్లి చూడగా సరోజినీ చేతిలో రక్తమోడుతున్న కత్తితో తలుపు దగ్గర నిలబడి ఉంది. ఆమెను బంధించి పోలీసులకు అప్పగించారు. రీనా యాదవ్, ఆమె పిల్లలను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె, ఆమె కుమారుడు మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. చికిత్స పొందుతున్న ఇద్దరు కుమార్తెల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

కానిస్టేబుల్‌ లలితేష్ యాదవ్‌, సరోజినీ భరద్వాజ్‌ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆమె శుక్రవారం అతని ఇంటికి రాగా కానిస్టేబుల్‌ లలితేష్‌ ఆమెను పంపించేశాడు. కానీ శనివారం అతను లేని సమయంలో అక్కడికి వచ్చిన సరోజినీ ఊహించని విధంగా దారుణానికి పాల్పడింది. నిందితురాలిపై హత్య, హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు భిలాయ్ సీఎస్పీ సత్యప్రకాష్ తివారీ తెలిపారు. నిందితురాలిని అరెస్టు చేశామని, దాడికి గల కచ్చితమైన కారణం కానిస్టేబుల్‌తో ఆమెకున్న ప్రేమ వ్యవహారమేనని తేల్చారు. అయితే ఈ దాడి ముందస్తు ప్రణాళికతో జరిగిందా? లేదా? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us