దేశ రాజధానిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తనపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై పగ పెంచుకున్న బాలిక(16).. అతని తల్లిని తుపాకీతో కాల్చేసింది. ఈ ఘటన ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో మైనర్ బాలిక పిస్టల్ తీసుకుని మహిళ తలపై కాల్చింది. బాధిత మహిళ కిరాణా దుకాణం నడుపుతుండగా.. ఆమె వద్దకు వెళ్లి తుపాకీతో కాల్చింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధిత మహిళను స్థానికులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
కాగా, మహిళను తుపాకీతో కాల్చిన మైనర్ బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు కాల్చిందా? అని ఆరా తీస్తే.. షాకింగ్ విషయం వెలుగు చూసింది. 2021లో మైనర్ బాలికపై మహిళ కొడుకు, తను కూడా మైనరే(17) అత్యాచారం చేశాడు. ఈ వ్యవహారంలో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతి(IPC), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ(POCSO) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, తనపై అత్యాచారం చేసిన బాలుడు బెయిల్‌పై బయటకు వచ్చి యధేచ్చగా తిరుగుతుండటంతో బాలికలో ఆగ్రహం పెరిగింది. పగతో రగిలిపోయింది. ఈ క్రమంలోనే తుపాకీ తీసుకుని నిందితుడి ఇంటికి వెళ్లింది. అక్కడ నిందితుడి తల్లి ఉండటంతో ఆమెపై కాల్పులు జరిపింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలిక తన ప్రియుడి సహాయంతో కన్నతల్లినే చంపేసింది. అమ్మాయి తన తల్లికి నిద్రమాత్రలు కలిపిన ఆహారం ఇచ్చింది. ఆమె నిద్రమత్తులోకి జారుకోగానే.. తన ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. ఆ తరువాత ఇద్దరూ కలిసి కత్తితో మహిళ గొంతు కోసేశారు. అనంతరం కడుపులో పొడిచి చంపేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..