
రైళ్లల్లో టికెట్ బుకింగ్ అనేది సింపుల్ అయిపోయింది. జస్ట్ మొబైల్ నుంచే నిమిషాల్లోనే టికెట్ బుక్ చేసుకోగలుగుతున్నాం. ఇక సెకండ్ క్లాస్‌లో వెళ్లాలనుకునేవారు కూడా రైల్వే టికెట్ కౌంటర్‌కు వెళ్లి క్యూలైన్‌లో నిల్చోవాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా రైల్వే టికెట్ బుకింగ్ సేవలు వేగవంతమయ్యాయి. ఆఫ్‌లైన్‌లో రైల్వే టికెట్ కౌంటర్‌కు వెళ్లి టికెట్ తీసుకుంటే ఇబ్బంది ఏం ఉండదు. కానీ ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకునేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం.
మీరు రైల్వే కౌంటర్ నుంచి టికెట్ బుక్ చేసుకుని ప్రయాణం చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఐడీ ప్రూఫ్ అవసరం లేదు. అదే ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకుని ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా గుర్తింపు ధృవీకరణ పత్రం అవసరం. చాలామంది ఫోన్‌లో మెస్సేజ్ చూపిస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ టీటీఈ అడిగినప్పుడు ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ఆధార్, ఓటర్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పార్ట్ లేదా మీ ఫొటో, సంతకంతో ప్రభుత్వాలు జారీ చేసే ఏదైనా ఐడీ ప్రూఫ్‌ను మీ వెంట తీసుకెళ్లాలి. టీటీఈ మిమ్మల్ని అడిగినప్పుడు ఫోన్‌లో టికెట్ డీటైల్స్‌తో పాటు ఏదైనా ధృవీకరణ పత్రం చూపించాలి. లేకపోతే రైల్వే నిబంధనల ప్రకారం మీకు భారీగా జరిమానా లేదా మధ్యలో ట్రైన్ నుంచి దింపేయవచ్చు.
రైల్వేశాఖ నిబంధనల ప్రకారం..మీరు ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్నా టీటీఈ అడిగినప్పుడు ఐడీ ప్రూఫ్ చూపించకపోతే మిమ్మల్ని టికెట్ లేకుండా ప్రయాణించినట్లు నిర్ధారిస్తారు. మీ దగ్గర గుర్తింపు ధృవీకరణ పత్రం లేకపోతే మీ టికెట్ పూర్తిగా పనికిరానిదిగా పరిగణిస్తారు. దీని వల్ల మీకు జరిమానా విధిస్తారు. మీరు ఎక్కడైతే ట్రైన్ ఎక్కారో అక్కడనుంచి గమ్యస్థానానికి ఎంత టికెట్ ఛార్జీ ఉందో అంత తిరిగి చెల్లించాలి. దానితో పాటు అదనంగా టీటీఈ ఫైన్ వసూలు చేస్తారు. ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తుంటే.. రూ.400, స్లీపర్ కోచ్‌లో అయితే రూ.200 జరిమానా విధిస్తారు.
ఐడీ ప్రూఫ్‌ను చూపించని పక్షంలో మీ ఈ-టికెట్ రద్దు చేశారు. దీంతో మీ సీటు పోతుంది. ఛార్జీ, జరిమానా విధించిన తర్వాత కూడా మీరు సీటును పొందలేరు. టీటీఈపై అది ఆధారపడి ఉంటుంది. కొన్ని సమయాల్లో మిమ్మల్ని టీటీఈ ట్రైన్ నుంచి మధ్యలో దింపివేసే అవకాశం కూడా ఉంది.