భార్య చదువుకోవడం ఇష్టం లేని ఓ భర్త.. ఏకంగా తన భార్య పరీక్ష రాస్తున్న హాల్ లోకి వెళ్లి.. భార్య రాసిన ఆన్సర్ షీట్ ను చింపేసి తన కసి తీర్చుకున్న విచిత్ర ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని శివపురిలోని సంకత్మోచన్ కాలనీలో ఓ భర్త చేసిన పనికి అక్కడున్నవారంతా షాకయ్యారు. పరీక్ష హాలులో ఒక యువతి పరీక్ష రాస్తోంది. అదే సమయంలో ఆమె భర్త హఠాత్తుగా పరీక్ష హాలులోకి ప్రవేశించి భార్య సమాధాన పత్రాన్ని చింపేశాడు. ఇది చూసిన భార్య బోరున విలపించింది.
ఆ వ్యక్తి చేసిన పనిని చూసి పరీక్ష హాలులో ఉన్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భర్త చింపేసిన ఆన్సర్ షీట్ ముక్కలను చేతిలోకి తీసుకుని రోదించిన యువతి పేరు ఆర్తి లోధి. ఆ భర్త పేరు మన్మోహన్ లోధీ. తన భర్త తనను నిత్యం వేధిస్తూనే ఉంటాడని.. అందుకే అతనితో కలిసి జీవించడం లేదని ఆర్తి చెప్పింది. ఇప్పుడు పరీక్ష హాలుకు వచ్చి ఈ పని చేశాడంటూ వాపోయింది.
‘భార్య చదువు కోవడం ఇష్టం లేదంటున్న భర్త..
నిజానికి ఆర్తి లోధి పరీక్షకు హాజరయ్యేందుకు శనివారం పిచోర్‌లోని ఛత్రసాల్ కాలేజీకి వచ్చింది. ఆర్తి ఇతర విద్యార్థులతో పాటు తనకు ఇచ్చిన ప్రశ్నపత్రాన్ని తీసుకుని సమాధానాలు రాయడం మొదలు పెట్టింది. అప్పుడే సంకత్మోచన్ కాలనీలో ఉంటున్న ఆమె భర్త మన్మోహన్ లోధీ పరీక్ష హాలులోకి ప్రవేశించారు. ఆ సమయంలో పరీక్ష హాలులో విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్లు ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు. అందుకే మన్మోహన్ పరీక్ష హాలులోకి వెళ్తున్న సంగతి ఆయన చూడలేదు.
ఈలోగా అవకాశం చూసుకుని భార్య ఆర్తి ఆన్సర్ షీట్ ను చింపేశాడు. వెంటనే ఉపాధ్యాయులు అతనిని పట్టుకున్నారు. అప్పుడు అతను తన భార్య చదువు కోసం ఇష్టం లేదని.. చదువు చెప్పవద్దు అంటూ ఉపాధ్యాయుడికి చెప్పాడు. ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు మన్మోహన్‌ను పట్టుకుని తీసుకెళ్లారు. ప్రస్తుతం మొత్తం వ్యవహారం శివపురిలో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..