India Pakistan War: ఎమర్జెన్సీ పవర్స్ వాడేయండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత్ - పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ననేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు ఇచ్చింది. యుద్ధ పరిస్ధితుల్లో వాడే అత్యవసర అధికారాలను వాడాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోంశాఖ.. ఆ వివరాలు..

India Pakistan War: ఎమర్జెన్సీ పవర్స్ వాడేయండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
Home Minister Amit Shah

Updated on: May 09, 2025 | 8:38 PM

భారత్ – పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ననేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు ఇచ్చింది. యుద్ధ పరిస్ధితుల్లో వాడే అత్యవసర అధికారాలను వాడాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోంశాఖ ఈ మేరకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. 1968 నాటి పౌర రక్షణ నిబంధనల ప్రకారం అత్యవసర అధికారాలను ఉపయోగించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ముఖ్యంగా దాడులు లేదా అంతరాయాల ముప్పు ఉన్న సందర్భాలలో ఈ ఆదేశంతో అధికారులు వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి, అత్యవసర కొనుగోళ్లు చేయడానికి వీలవుతుంది.

1968 నాటి పౌర రక్షణ నియమాలలోని సెక్షన్ 11ని అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రధాన కార్యదర్శులు, లెఫ్టినెంట్ గవర్నర్లకు కేంద్ర హోంశాఖ ఇవాళ లేఖ రాసింది. ఈ అధికారాల వల్ల ప్రజలను, ఆస్తులను రక్షించడానికి అవసరమైన అత్యవసర చర్యలు తీసుకోవచ్చు. అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితిలో విద్యుత్, నీరు, ఆసుపత్రులు, కమ్యూనికేషన్ వంటి ముఖ్యమైన సేవలు సజావుగా కొనసాగేలా ఏ చర్య అయినా తీసుకోవచ్చు. అలాగే కేంద్రం నుంచి అనుమతుల కోసం వేచి ఉండకుండా సాధారణ ప్రక్రియను పక్కనబెట్టి పౌర రక్షణకు అవసరమైన పరికరాలు లేదా సేవలను నేరుగా కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తోంది. సైనిక దాడి, ఉగ్రవాద దాడి జరిగినా లేదా సాధారణ జీవితానికి అంతరాయం కలిగించే ఏ చర్య అయినా రాష్ట్రాలు వేగంగా చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.