చైనాలో పుట్టిన HMPV (హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్) కోవిడ్ మాదిరి ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తుంది. భారత్ ఇప్పటికే ఈ వ్యాధి సంక్రమణపై అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే HMPV వైరస్‌తో COVID-19కి కొంత సారూప్యత ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. గురుగ్రామ్‌లోని మారెంగో ఆసియా హాస్పిటల్స్‌లోని సీనియర్ కన్సల్టెంట్- ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ దీక్షా గోయల్ మాట్లాడుతూ.. HMPV, COVID-19 మధ్య తేడాలు, సారూప్యతలను వెల్లడించారు.
డాక్టర్ దీక్షా గోయల్ మాట్లాడుతూ, HMPV అనేది శ్వాసకోశ వైరస్. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులు, శరీరంలోని వాయుమార్గాలను ప్రభావితం చేస్తుంది. ఇది దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాసలో గురక వంటి సాధారణ జలుబు వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇది సాధారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిని ప్రభావితం చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ అంటువ్యాధి వంటిది. చాలా కేసుల్లో తీవ్రత లేనప్పటికీ, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు న్యుమోనియా లేదా బ్రోన్కియోలిటిస్‌కు దారితీస్తాయి. HMPV వైరస్ దశాబ్దాలుగా భూమిపై ఉనికిలో ఉన్నప్పటికీ అకస్మాత్తుగా వ్యాప్తి చెందడం, వ్యాధినిరోధకత బలహీనంగా ఉన్నవారిపై అధికంగా దాడి చేయడం వంటి.. వైరస్ ప్రవర్తనలోని ఈ మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి.
HMPV చుట్టూ అనేక అపోహలు కూడా ఉన్నాయి. ఇది COVID-19 వలె ప్రాణాంతకం కావచ్చని చాలా మంది భావిస్తున్నారు. నిజానికి, HMPV వైరస్ తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యానికి కారణం అవుతుందనేది వాస్తవమే. కొందరిలో తీవ్ర అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉంది. COVID-19తో పోలిస్తే దాని మరణాల రేటు ప్రాబల్యం చాలా తక్కువ. HMPV సోకిన వారిలో తేలికపాటి నుంచి మధ్యస్తంగా అనారోగ్యాన్ని కలిగిస్తుంది. అయితే తీవ్రమైన కేసులు సాధారణంగా శిశువులు, వృద్ధులు, ఇతర రోగనిరోధక శక్తి లేనివారిలో సంభవిస్తాయి. అలాగే HMPV అనేది కోవిడ్-19 మాదిరి వేగంగా వ్యాప్తి చెందదు.
చల్లని వాతావరణంలో గుమికూడి ఉంటే శ్వాసకోశ వైరస్‌లు వ్యాప్తి చెందుతాయి. COVID-19 మహమ్మారి కారణంగా విధించిన ఆంక్షలను ప్రస్తుతం దాదాపు సడలించబడ్డాయి. దీని మూలంగా మునుపటి మాదిరి వ్యక్తులు సన్నిహితంగా ఉండే అవకాశం ఉంది. దీంతో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం లేకపోలేదు.
HMPVని నివారించడానికి.. తరచుగా చేతులు కడుక్కోవడం, ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తితో సంబంధాన్ని నివారించడం, నోరు, ముక్కును కప్పి దగ్గడం, తుమ్మడం వంటి పరిశుభ్రత పద్ధతులను పాటించాలి .
అధికంగా జన సంచారం ఉన్న ప్రాంతాల్లో క్రిమిసంహారకం చేయాలి. మీకు వైరస్ సోకితే, వైరస్ చుట్టూ వ్యాపించకుండా ఇంట్లోనే ఉండి, విశ్రాంతి తీసుకోవాలి. హైడ్రేటెడ్ గా ఉండాలి. జ్వరం, జలుబుకు మందులు తీసుకోవాలి.
లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా అధిక జ్వరంతో ఇబ్బందిపడితే దగ్గరిలోని ఆస్పత్రికి వెళ్లి, వైద్య సహాయం తీసుకోవాలి.