కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుందా? పార్టీకి గుడ్ బై చెప్పేందుకు మరో సీనియర్ నేత రంగం సిద్ధం చేసుకున్నారా? హస్తిన వర్గాల్లో ఇప్పుడు ఇదే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) తో కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ(Anand Sharma) గురువారంనాడు భేటీ అయ్యారన్న కథనాలతో ఆయన కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. జేపీ నడ్డా, ఆనంద్ శర్మ ఇద్దరూ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రానికి చెందినవారే. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే నవంబరు మాసంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జేపీ నడ్డాతో ఆనంద్ శర్మ భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
నెహ్రూ- గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఆనంద్ శర్మకు గుర్తింపు ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని కోరిన జీ-23 సీనియర్ నేతల్లో ఆయన కూడా ఉన్నారు. జీ-23 నేతల్లో ఒకరైన కపిల్ సిబల్ ఆ పార్టీకి రాజీనామా చేసి సమాజ్‌వాది పార్టీలో చేరడం తెలిసిందే. ఇప్పుడు ఆనంద్ శర్మ కూడా కాంగ్రెస్ పార్టీని వీడుతారన్న ప్రచారం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి.
అయితే తాను బీజేపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆనంద్ శర్మ తోసిపుచ్చారు. జేపీ నడ్డాతో భేటీ అయ్యానన్న కథనాలను ధృవీకరించని ఆయన.. అవసరమైతే నేరుగా నడ్డాతో భేటీ అయ్యే హక్కు తనకు ఉందని వ్యాఖ్యానించారు. జేపీ నడ్డా, తాను ఒకే రాష్ట్రానికి చెందినవారమని గుర్తుచేశారు. తామిద్దరూ ఒకే యూనివర్సిటీలో చదువుకున్నామని చెప్పుకొచ్చారు. తామిద్దరూ కలుసుకుంటే దానికి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు రాజ్యసభ సభ్యుడైన ఆనంద్ శర్మ. తమ మధ్య పాత సామాజిక సంబంధాలు, కుటుంబ సంబంధాలు ఉన్నాయన్నారు. తమ రాష్ట్రం, యూనివర్సిటీకి చెందిన వ్యక్తి జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం పట్ల తాను గర్విస్తున్నట్లు పేర్కొన్నారు.
Delhi | If I have to meet BJP chief JP Nadda, I have every right to meet him, for me, he is just not the BJP president. We both come from the same state & share the same alma mater. There shouldn’t be any political significance attached to it: Congress Rajya Sabha MP Anand Sharma pic.twitter.com/guEXNVDK5T
— ANI (@ANI) July 7, 2022
సౌద్ధాంతిక విభేదాలు ఉన్నంత మాత్రన తమ మధ్య శతృత్వం ఉన్నట్లు కాదని ఆనంద్ శర్మ పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ కార్యక్రమానికి తనను, జేపీ నడ్డాను ఆహ్వానించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇద్దరూ హాజరుకావడంపై జేపీ నడ్డాతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి