Heavy Rains: దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. వర్షాల కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భారీ నష్టం వాటిల్లుతోంది. ఇక మహారాష్ట్రలో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముంబై మహానగరంతో పాటు రాష్ట్రంలోని పలు నగరాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ముంబై శివార్ల లోని భివాండిలో వరద పోటెత్తింది. వందలాది ఇళ్లు నీట మునిగాయి. కార్లతో పాటు ఇతర వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. రత్నగిరిలో కుంభవృష్టి కురిసింది. కొండచరిచయలు విరిగిపడడంతో చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగం లోకి దింపారు.
ఇక తాజాగా గురువారం రాత్రి రాష్ట్రంలోని రాయ్‌గఢ్ జిల్లాలోని మహద్ తలై గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. సుమారు 300 మంది పౌరులు చిక్కుకున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా అంచనా వేసింది. విషయంలో తెలుసుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే భారీ వర్షాల కారణంగా ఘటనా స్థలం మొత్తం నీటితో నిండిపోవడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతుందని రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్ తెలిపారు. కొండచరియల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఆర్మీ, నేవీ బృందాలు రంగంలోకి దిగింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇళ్లన్నీ నీటిలో మునిగిపోవడంతో ప్రజలు ఎత్తైన భవనాలను ఎక్కి రక్షించుకుంటున్నారు. అర్ధరాత్రి సమయంలో కొండ చరియాలు విరిగిపడటంతో చీకటి కారణంగా ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, ఇతర సహాయక బృందాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
బోట్లతో సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహించడంతో ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారు.
ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ముంబైతోపాటు థానే మున్సిపల్ కార్పొరేషన్‌లు అలర్ట్ జారీ చేశాయి. నాసిక్‌లో కొండచరియలు విరిగిపడడంతో రైల్వేట్రాక్‌లు ధ్వంసమయ్యాయి.