Heavy Rains: ఉత్తరాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. ధర్మశాలలో ఆకస్మిక వరదలు.. మహారాష్ట్రలో కుండపోత వర్షాలు

|

Jul 12, 2021 | 9:53 PM

ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా ఏకధాటిగా కురుస్తోన్న వానలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

Heavy Rains: ఉత్తరాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. ధర్మశాలలో ఆకస్మిక వరదలు.. మహారాష్ట్రలో కుండపోత వర్షాలు
Heavy Rains Cause Flash Flood In North India
Follow us on

Heavy rains cause flash floods: ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా ఏకధాటిగా కురుస్తోన్న వానలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో కురుస్తున్న కుండపోతకు మాంఝీ నది ఒక్కసారిగా పోటెత్తింది. దీంతో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఆకస్మిక వరదలు వణికించాయి. వరదనీటిలో చాలా కార్లు కొట్టుకుపోయాయి. కార్లు కొట్టుకుపోతుంటే జనం షాక్‌కు గురయ్యారు.

హిమాచల్ ప్రదేశ్‌లో సుమారు నెలరోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం వాటి తీవ్రత మరింత పెరిగింది. 48 గంటలుగా ఏకధాటిగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో మాంఝీ నదిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. వరద తీవ్రత మరింత పెరగడంతో.. మాంఝీ నది ఉధృతి ప్రముఖ బౌద్ధక్షేత్రం ధర్మశాలను ముంచెత్తింది. భాగ్‌సు నాగ్ ప్రాంతంపై విరుచుకుపడింది. ఆ ప్రాంతమంతా వరద నీటితో నిండిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ధర్మశాలలో చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లు , వంతెనలు కొట్టుకుపోయాయి. వరదనీటిలో కార్లు కొట్టుకుపోయాయి. కొండచరియలు విరుచుకుపడటంతో జాతీయ రహదారి మూతపడింది. హిమాచల్‌ప్రదేశ్‌లో వరదలపై ప్రధాని మోదీ , కేంద్ర హోంశాఖ మంత్రి సమీక్షించారు. ప్రజలకు కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


ఇటు ఉత్తరాఖండ్‌ చమోలీలో భారీ వర్షాలతో రిషీకేష్‌-బద్రీనాథ్‌ నేషనల్‌ హైవే కూడా క్లోజ్‌ అయింది. వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌..సహాయకచర్యలు చేపట్టాయి. కొండచరియలను తొలగిస్తున్నారు. మరోవైపు రాజస్థాన్‌, యూపీల్లో పిడుగుల ధాటికి పిట్టల్లా రాలిపోతున్నారు జనం. ఒక్కరోజులో 90 మందికి పైగా చనిపోవడం కలిచివేసింది. యూపీలో 30 మందిని చనిపోగా, ఒక్క ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలోనే 13 మంది మృతి చెందారు. కౌశంబి, ఫతేపూర్‌, ఫిరోజాబాద్‌ జిల్లాల్లో 17మంది చనిపోయారు. ఇక రాజస్థాన్‌లో పిడుగుల ధాటికి 28మంది కన్నుమూశారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల కుటుంబాలకు 50లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు సీఎం. మరోవైపు కేంద్రం మృతి చెందిన చిన్నారులకు 2లక్షల సాయం ప్రకటించింది.


ఇటు, మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రత్నగిరి జిల్లాలో పలు పట్టణాలు నీట మునిగాయి. రత్నగిరి జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ రెడ్ అలర్ట్‌ జారీ చేసింది. వచ్చే మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. పాల్‌ఘర్, ముంబై, థానేల్లోనూ ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది. రత్నగిరి జిల్లా లోని రాజాపూర్‌ పూర్తిగా నీట మునిగింది. అటు హిమాచల్‌ప్రదేశ్‌ , ఇటు మహారాష్ట్రలో కూడా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలను చేపట్టాయి.


Read Also… వర్షాకాలంలో ఈ 5 ఆహార పదార్థాలు కచ్చితంగా మీ డైట్‌లో ఉండాలి..!