హర్యానాలో మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా స్థాపించిన పార్టీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) రాష్ట్ర అధ్యక్షుడు, బహదూర్‌గఢ్ మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాఠీపై ఘోరమైన దాడి జరిగింది. నఫే సింగ్ రాఠీ సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు భద్రతా సిబ్బందిపై కూడా కాల్పులు జరిపారు. గాయపడిన నఫే సింగ్ రాఠీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
నఫే సింగ్ రాఠీ మరణాన్ని ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ధృవీకరించింది. ఈ ఘటన బరాహి గేట్ సమీపంలో జరిగింది. దాడి చేసిన వ్యక్తులు ఐ-10 వాహనంలో వచ్చారు. నఫే సింగ్ కారుపై బుల్లెట్ల వర్షం కురిపించారు. కారు ప్రయాణిస్తున్న నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో బ్రహ్మశక్తి సంజీవని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నఫే సింగ్ రాఠీ మరణించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐఎన్‌ఎల్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు నఫే సింగ్‌పై జరిగిన దాడి పక్కా ప్రణాళికతో జరిగిన దాడి అని పోలీసులు నిర్ధారించారు. ఈ కాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు.
కారులో వచ్చిన కొందరు దుండగులు నఫే సింగ్ రాఠీ, అతని ముగ్గురు గన్‌మెన్‌లపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కారు ముందు సీటులో కూర్చున్న రాఠీతో పాటు అతని ముగ్గురు గన్‌మెన్‌లు గాయపడ్డారు. ఘటన అనంతరం దుండగులు తమ కారులో పరారయ్యారు. క్షతగాత్రులను బ్రహ్మశక్తి సంజీవని ఆసుపత్రిలో చేర్పించారు. INLD మీడియా సెల్ ఇన్‌ఛార్జ్ రాకేష్ సిహాగ్ నఫే సింగ్ రాఠీ మరణాన్ని ధృవీకరించారు. నఫే సింగ్ రాఠీ మెడ, నడుము భాగంలో బుల్లెట్లు తగిలాయి. దాడి జరిగిన సమయంలో రాఠీ తన ఫార్చ్యూనర్ కారులో ప్రయాణిస్తుండగా, దాడి చేసిన వ్యక్తులు ఐ-20 కారులో వచ్చారని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సీఐఏ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్)లను మోహరించినట్లు ఝజ్జర్ ఎస్పీ అర్పిత్ జైన్ తెలిపారు. ఈ ఘటన వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని సన్నిహితుడు కాలా జాతేడి హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఆస్తి వివాదమే హత్యకు కారణమని తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…