నేటి సమాజంలోని యువత అన్నం, నీళ్లు లేకపోయినా బతకగలరు కానీ.. ఓ గంట సెల్‌ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. జీవితంలో సెల్‌ఫోన్ కూడా భాగమైపోయింది.. ప్రపంచమంతా అరచేతిలో ప్రత్యక్షమైపోతుంది. సెల్‌ఫోన్ వాడకం వల్ల ఎంత ప్రయోజనముందో.. కలిగే అనర్థాలు కూడా మనకు తెలిసినవే. ఇలాంటి సమస్యలు పెళ్లికాని యువతీ యువకులే ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.
అయితే.. గుజరాత్‌లోని ఓ గ్రామం మాత్రం పెళ్లికాని యువతులు సెల్‌ఫోన్ వాడకాన్ని నిషేధించింది. పిల్లలు తమ తల్లిదండ్రులకు చెప్పకుండా ఎవర్నో ఒకర్ని పెళ్లి చేసుకుని వెళ్లిపోతారనే భయంతో పాటు.. ఫోన్ల వాడకం వల్ల పిల్లలు చెడుదారి పట్టే అవకాశముందని.. ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని బనస్కంత జిల్లాలోని జలోల్ గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయమిది. గ్రామంలో పెళ్లి కాని అమ్మాయిలు సెల్‌ఫోన్ వాడకూడదని ఆంక్ష విధించారు. అసలు వారి చేతిలో ఫోన్ అనే వస్తువునే కనిపించడకూడదు. ఒకవేళ ఓ అమ్మాయి సెల్‌ఫోన్ వాడితే.. ఆ అమ్మాయి తండ్రికి రూ.లక్షన్నర జరిమానా విధించనున్నట్లు ఆ ఊరి గ్రామ పెద్దలు తెలిపారు.
ప్రస్తుతమున్న సమాజంలో వారి హక్కులకు భంగం కలగకుండా.. ఎవరు ఏమైనా చేయవచ్చు. ఎవరి ఇష్టం వచ్చిన వారు ఉండవచ్చు. కానీ.. ఈ జలోల్ గ్రామ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం ఆ ఊరి అమ్మాయి హక్కుల్ని హరించే విధంగా ఉంది. మరి దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
కాగా.. ఈ పరిణామాలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివాహ విషయంలో కట్టడి చేసే విషయం బావుంది.. కానీ.. ఇలా టీనేజ్ అమ్మాయిలను మొబైల్ ఫోన్లు వాడకుండా నిషేధం విధించడంపై .. మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు కాంగ్రెస్ నేత అల్పేష్ తెలిపారు.