
చేతికి బైక్ దొరికిందంటే చాలు.. కొందరు యువకులు రెచ్చిపోతున్నారు. సరదా పేరుతో వాళ్లు చేసే వికృత చేష్టలు ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు తీసుకొస్తుంటుంది. వయసుకొచ్చామన్న ఉత్సాహమో.. తమని ఆపేవాళ్లు లేరన్న పెద్దరికమో తెలియదు కానీ, విచక్షణ మరిచి చేస్తున్న చర్యలు ఊపిరి తీస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ యువకుడు కోరి మరీ ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్-రాజ్‌కోట్ హైవే పక్కన ఉన్న ఫల్లా గ్రామం వద్ద యువకులు బైక్ రేసులు, స్టంట్లు చేశారు. రాత్రిపూట హైవేపై ప్రమాదకర రీతిలో స్టంట్లు చేశారు. అతివేగంతో ఎదురుగా ఏం వస్తున్నాయో.. ఏం వెళ్తున్నాయో అనే జాగ్రత్త లేకుండా బైకులపై పడుకుని డ్రైవ్ చేశారు. తమ కన్నా ముందు వెళ్తున్న వాహనాలను సైతం తప్పిస్తూ ముందుముందుకు దూసుకుపోయారు. పైగా ఒకరితో ఒకరు పోటీ అన్నట్లుగా బైకులతో చిత్ర విచిత్ర విన్యాసాలు చేశారు. ఇదే క్రమంలో ఓ యువకుడు తన పక్కగా వేగంగా వెళ్తున్న ఓ లారీని తప్పించబోయి ప్రమాదవశాత్తు ఢీకొని అంతే వేగంతో కింద పడిపోయాడు. దీని ఫలితంగా తీవ్ర గాయాలపాలై రక్తమోడుతూ అక్కడిక్కడే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువకుడు లారీని ఢీకొని కింద పడిపోయిన తీరు చూస్తే ఎవరికైనా ఒళ్లు జలదరించక మానదు. ఇలాంటివి చూసైనా యువతకు కనువిప్పు కలగాలని పలువురు అంటున్నారు. మరీ ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా పిల్లల చేతికి వాహనాలు ఇస్తున్న తల్లిదండ్రులు ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. బైకులపై ప్రమాదకర స్టంట్లు లాంటివి చేయకుండా కట్టడి చేయాలని కోరుతున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నిండు ప్రాణాలు బలి కావాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని, జీవితం ఎంతో విలువైందని, ఇలాంటి పనికిమాలిన చర్యల వల్ల భవిష్యత్తును చీకటిమయం చేసుకోరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..