Gujarat: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన కంటైనర్.. 10 మంది దుర్మరణం..

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోపైకి దూసుకెళ్లిన ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Gujarat: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన కంటైనర్.. 10 మంది దుర్మరణం..
Gujarat Accident

Updated on: Oct 04, 2022 | 8:09 PM

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోపైకి దూసుకెళ్లిన ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కంటైనర్ వేగంతో ఢీకొట్టడంతో ఆటో తుక్కు తుక్కైంది. ఆటోలో చిక్కుకున్న వారిని గ్యాస్ కట్టర్ల సహాయంతో బయటకు తీశారు. ఈ దుర్ఘటన వడోదర ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దర్జీపురా సమీపంలో జరిగింది. సూరత్ నుంచి వస్తున్న కంటైనర్ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ముందు కారును ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి.. రోడ్డు అవతలి వైపునకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. అనంతరం ఎయిర్ ఫోర్స్ కాంపౌండ్ లోకి దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు, మహిళలు సహా 10 మంది మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. క్షతగాత్రులకు వడోదర నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందుతుందని పోలీసు ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఆర్ వెకారియా తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆటో నుజ్జునుజ్జు కావడంతో అగ్నిమాపక దళం, ఎయిర్ ఫోర్స్ బృందం గ్యాస్ కట్టర్ సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదం అనంతరం 48వ నెంబరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

కాగా.. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ప్రధాని మోడీ.. మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సంతాపం వ్యక్తం చేస్తూ మృతుల బంధువులకు రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్  చేయండి..