
ఒకప్పుడు ఏ చోటుకైనా వెళ్లాలంటే అడ్రస్ తెలియకపోతే పక్కన ఉన్న వాళ్లను అడిగి తెలుసుకునేవాళ్లు. అయితే ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ యుగంలో ఫోన్‌తోనే అన్ని పనులు జరుగుతున్నాయి. ఎక్కడికైనా తెలియని చోటుకి వెళ్లాలంటే ఎంచక్కా గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి.. అనుకున్న గమ్యస్థానానికి సులువుగా చేరుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఈ విధానాన్నే అనుసరిస్తున్నారు. గతంలో లాగా రూట్లను గుర్తుపెట్టుకునే పరిస్థితి కూడా ఇప్పుడు చాలావరకు తగ్గిపోయింది. అంతా గూగుల్ మ్యాప్స్ మయం అయిపోయింది. ఒక్కసారి ఈ గూగుల్ మ్యా్ప్స్ పనిచేయకపోతే.. ఇక మొత్తం అల్లకల్లోలమే అవుతుంది. చాలామంది ఏదైన కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు తెలెత్తుతాయి. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు రూటు తెలియక తికమక పడిపోవాల్సి వస్తుంది. కానీ కొన్నిసార్లు జీపీఎస్‌ను నమ్ముకున్న కూడా తప్పుడు మార్గాలు సూచించే పరిస్థితులు కూడా వస్తాయి.
అయితే ఈ రోడ్డు ప్రయాణ సమయంలో కేవలం టెక్నాలజీని మాత్రమే నమ్ముకుంటే.. సొంతంగా ఆలోచించడం మానేస్తే అది చివరికి ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఎందుకంటే గతంలో అలా గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని తప్పుడు మార్గాల్లోకి వెళ్లడం, అలాగే వాహనం ఏకంగా నదిలోకి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా కేరళలోని జీపీఎస్‌ను నమ్ముకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువ డాక్టర్లు జీపీఎస్‌ను నమ్ముకొని కారుని నదిలోకి నడిపించి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. శనివారం రోజున అర్థరాత్రి ఎర్నాకుళం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కొల్లాంకు చెందిన డాక్టర్ అద్వైత్ (28), త్రిశూర్‌కు చెందిన డాక్టర్ అజ్మల్ (28) ఓ ప్రైవేటు వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్నారు. వీళ్లు కొడుంగల్లూరుకు చెందిన ఆస్పత్రిలో తమ విధులు ముగించుకొని శనివారం రోజున రాత్రిపూట వాళ్ల ఇళ్లకు బయలుదేరారు.
అయితే వీళ్లతోపాటుగా డాక్టర్ తబ్సిర్, ఎంబీబీఎస్ విద్యార్థిని తమన్నా, నర్స్ జిస్మాన్ కూడా ఆ కారులో ఎక్కారు. డాక్టర్ అద్వైత్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్నాడు. ఆ తర్వాత రోజే అతని పుట్టిన రోజు. ఇందుకోసం వాళ్లు కొంచెం షాపింగ్ చేసి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఈ ప్రయాణ సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్డు మార్గం సరిగా కనిపించలేదు. అద్వైత్ వెంటనే జీపీఎస్‌ను అనుసరించి డ్రైవింగ్ చేస్తున్నట్లు అతని పక్కన కూర్చొని ఉన్న ఎంబీబీఎస్ విద్యార్థిని తమన్నా పేర్కొంది. అయితే ఈ క్రమంలోనే జీపీఎస్ రీరూట్ అయిపోయింది. అయితే దీన్ని అనుసరించిన అతడు రోడ్డు మధ్యలో నీరు నిలిచి ఉన్న ప్రాంతాన్ని రోడ్డు అని అనుకున్నాడు. అలాగే కారును నేరుగా నీటిలోకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. అయితే అది నది అని గుర్తించేలోపే ఆ కారు నీటిలో మునిగిపోయింది. అయితే ఈ ఘటన అర్ధరాత్రిపూట 12.30 AM సమయంలో జరిగింది. వాళ్ల గురించి తెలుసుకున్న స్థానికులు ముగ్గురిని రక్షించారు. కానీ అద్వైత్, అజ్మల్ మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా.. జీపీఎస్‌లు అనేవి సాధారణంగా తక్కువ ట్రాఫిక్ ఉన్నటువంటి వైపు మార్గాన్ని సూచిస్తాయని.. అవి అంత సరక్షితమైనవి కాదని నిపుణులు అంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..