
నొప్పి, జ్వరానికి వాడే నైమెసులైడ్ మందులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 100 మిల్లీగ్రాములకుపైగా డోస్ ఉన్న నైమెసులైడ్ ఇమిడియట్ రిలీస్ ట్యాబ్లెట్లు, సిరప్‌ల.. తయారీ, విక్రయాలు, పంపిణీపై పూర్తిగా నిషేధించింది. ఈ నిర్ణయం డిసెంబర్ 29, 2025 నుంచి తక్షణమే అమల్లోకి వస్తుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్–1940లోని సెక్షన్ 26ఏ కింద, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్‌తో సంప్రదించిన అనంతరం ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపింది. 100 మిల్లీగ్రాములకంటే అధిక మోతాదులో ఉన్న నైమెసులైడ్ మందులు మన ఆరోగ్యానికి ప్రమాదకరమని, అదే విధంగా పని చేసే సురక్షిత మెడిసిన్ అందుబాటులో ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యంగా ఈ మందు వాడకంతో లివర్‌కు హాని కలిగే అవకాశాలు ఉన్నాయని గత కొన్నేళ్లుగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే తక్కువ మోతాదులోని నైమెసులైడ్ మందులు, అలాగే ఇతర జ్వర–నొప్పి నివారణ ఇతర మెడిసిన్ మార్కెట్‌లో కొనసాగుతాయి. ఈ నిర్ణయంతో నైమెసులైడ్ ఆధారిత మందులు తయారు చేస్తున్న కంపెనీలు.. ఉత్పత్తిని నిలిపివేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న స్టాక్‌ను వెనక్కి పిలిపించుకోవాలి. పెద్ద ఔషధ సంస్థలపై ఈ నిర్ణయ ప్రభావం స్వల్పంగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే నైమెసులైడ్ అమ్మకాలపై ఎక్కువగా ఆధారపడిన చిన్న కంపెనీలకు మాత్రం ఆదాయంపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా గతంలోనూ కేంద్ర ప్రభుత్వం.. ప్రమాదకర ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్లు, భద్రతపై అనుమానాలున్న మందులను నిషేధించింది. తాజా నిర్ణయం కూడా డ్రగ్ సేఫ్టీపై కేంద్రం కఠిన వైఖరికి నిదర్శనంగా నిలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..