ప్రపంచమే పొదుపు మంత్రం జపిస్తోంది.. మోదీ పిలుపు వెనుక గ్లోబల్ అలర్ట్!
ప్రపంచవ్యాప్తంగా చమురు, ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చుతున్న వేళ.. అనేక దేశాలు ప్రజలకు పొదుపు పిలుపునిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఇంధన రేషన్ వరకు కఠిన చర్యలు అమలు చేస్తున్న దేశాల సరసన.. భారత్ కూడా ముందస్తు జాగ్రత్తల దిశగా అడుగులు వేస్తోందన్న చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు సూచనలు ఇప్పుడు గ్లోబల్ ఎకనామిక్ అలర్ట్‌గా మారాయి.

ప్రపంచమే పొదుపు మంత్రం జపిస్తోంది.. మోదీ పిలుపు వెనుక అదే గ్లోబల్ అలారం!
చమురు సంక్షోభం, యుద్ధాల ప్రభావం, డాలర్ ఒత్తిడి, పెరుగుతున్న ఇంధన ధరలు.. ప్రపంచ దేశాలన్నింటినీ ఒక్కసారిగా అప్రమత్తం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన “పొదుపు – నియంత్రణ – స్వావలంబన” పిలుపు ఇప్పుడు అంతర్జాతీయ ధోరణికే ప్రతిబింబంగా కనిపిస్తోంది. కొందరు రాజకీయంగా విమర్శిస్తున్నా.. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ప్రజలను వినియోగం తగ్గించండి, ఇంధనం ఆదా చేయండి, అనవసర ప్రయాణాలు తగ్గించండి అంటూ హెచ్చరిస్తున్నాయి.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాలు ఇంధన పొదుపు కోసం అత్యవసర చర్యలు ప్రారంభించాయి. కొన్నిచోట్ల వారానికి నాలుగు రోజులే పని విధానం అమలు చేస్తున్నారు. మరికొన్ని దేశాలు ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరి వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తున్నాయి. కొన్ని దేశాలు అయితే పెట్రోల్ రేషన్ విధానం, ఆడ్-ఈవెన్ డ్రైవింగ్ రూల్స్, రాత్రి మార్కెట్లు ముందుగానే మూసివేత, ప్రభుత్వ ప్రయాణాలపై ఆంక్షలు వంటి కఠిన నిర్ణయాల దాకా వెళ్లాయి.
పాకిస్తాన్లో ప్రభుత్వ కార్యాలయాలకు 50 శాతం రిమోట్ విధానం అమలు చేస్తున్నారు. శ్రీలంకలో బుధవారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. బంగ్లాదేశ్‌లో విద్యుత్ ఆదా కోసం యూనివర్సిటీలకు సెలవులు ఇచ్చారు. ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా వంటి దేశాలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ప్రోత్సహిస్తున్నాయి. దక్షిణ కొరియాలో ప్రభుత్వ ఉద్యోగులకు ఆడ్-ఈవెన్ వాహన వినియోగ నిబంధనలు అమల్లో ఉన్నాయి.
ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు చాలా దేశాలు ఏసీ వినియోగంపైనా పరిమితులు విధించాయి. సింగపూర్, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్‌లాండ్ వంటి దేశాలు కార్యాలయాల్లో కనీస ఉష్ణోగ్రతలను ఫిక్స్ చేశాయి. జోర్డాన్ అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలకే నిషేధం విధించింది.
ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో మరో విషయం చెబుతోంది. కొన్నిచోట్ల గ్యాస్ సిలిండర్లను పూర్తిగా నింపకుండా సగం మాత్రమే ఇస్తున్నారు. మాల్దీవులు, నేపాల్ వంటి దేశాలు LPG వినియోగంపై ప్రత్యేక నియంత్రణలు తీసుకొచ్చాయి. మరోవైపు బ్రిటన్, స్పెయిన్, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ వ్యవస్థలు, హీట్ పంప్‌లకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి.
ఇలాంటి సమయంలో భారత్‌లో ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తి కూడా ఇదే గ్లోబల్ ట్రెండ్‌లో భాగంగా కనిపిస్తోంది. బంగారం కొనుగోళ్లు తగ్గించండి, ఇంధన వినియోగం నియంత్రించండి, సాధ్యమైన చోట వర్క్ ఫ్రమ్ హోమ్ పాటించండి, దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వండి అనే సూచనల వెనుక దేశ ఆర్థిక భద్రతే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
ప్రత్యేకంగా భారత్ పరిస్థితి మరింత సున్నితమైనది. ఎందుకంటే దేశం భారీగా చమురు, బంగారం, వంటనూనెలు, ఎరువుల దిగుమతులపై ఆధారపడుతోంది. ఇవన్నీ డాలర్లతోనే కొనాలి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సరఫరా అంతరాయాలు పెరిగితే.. డాలర్ల ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో ప్రతి డాలర్‌ను జాగ్రత్తగా వినియోగించాలనే ఆలోచనతోనే కేంద్రం ప్రజలకు ముందస్తు హెచ్చరికలు ఇస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇప్పటివరకు భారత్ నేరుగా కఠిన ఆంక్షలు విధించకపోయినా.. “స్వచ్ఛంద పొదుపు” దిశగా ప్రజలను మానసికంగా సిద్ధం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచం మొత్తం ఇంధన నియంత్రణ వైపు అడుగులు వేస్తున్న వేళ.. భారత్ కూడా ముందుగానే జాగ్రత్త పడుతోందన్న చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
