‘Yoga Break’: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇకపై కార్యాలయాల్లో మరో బ్రేక్.. ఎందుకోసమంటే..?

|

Nov 04, 2021 | 8:55 AM

పనిలో వచ్చే ఒత్తిళ్లను జయించి రెట్టించిన ఉత్సాహంతో ఉద్యోగులు పని చేస్తారన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ యోగా బ్రేక్‌ ప్రవేశపెట్టింది.

Yoga Break: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇకపై కార్యాలయాల్లో మరో బ్రేక్.. ఎందుకోసమంటే..?
Yoga Break
Follow us on

‘Yoga Break’ in Govt Offices: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో తీపి కబురు తీసుకువచ్చింది. కార్యాలయాల్లో ఇంకో కొత్త బ్రేక్‌ తీసుకురాబోతోంది. అదే యోగా బ్రేక్‌.. పనిలో వచ్చే ఒత్తిళ్లను జయించి రెట్టించిన ఉత్సాహంతో ఉద్యోగులు పని చేస్తారన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ యోగా బ్రేక్‌ ప్రవేశపెట్టింది. ఉద్యోగులు పని సమయంలో చైతన్యం నింపేందుకు ప్రభుత్వం కార్యాలయాల్లో ‘యోగా బ్రేక్’ను అమలు చేయాలని నిర్ణయించింది. ఒక అయిదు నిమిషాల సేపు ఉద్యోగులు అన్నీ మర్చిపోయి ప్రాణాయామం, ఆసనాలు, ధ్యానం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని కేంద్రం భావిస్తోంది.

ఇందుకోసం కేంద్ర ఆయుష్‌ శాఖ వై–బ్రేక్‌ యాప్‌ అనే యాప్‌ని రూపొందించింది. అందులో యోగా, ప్రాణాయామం ఎలా చేయాలో 5 నిమిషాల వీడియో ఉంటుంది. యోగా బ్రేక్‌ సమయంలో వై–బ్రేక్‌ యాప్‌లో చూపించినట్టుగా ఉద్యోగులు చేస్తే సరిపోతుంది. ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ యోగా బ్రేక్‌ తీసుకోవాలని సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బందికి కూడా యోగా బ్రేక్‌ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆ శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నవంబర్ 2 నుండి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ (NHIDC) కార్యాలయాల్లో ముందస్తుగా ఈ యోగా బ్రేక్ అమలు చేసింది.

ఆయుష్‌ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘యోగా బ్రేక్’ను ప్రయోగాత్మకంగా గత ఏడాది జనవరిలో ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో తొలిసారిగా అమలు చేసినట్లు తెలిపారు. వివిధ ఆసనాల ద్వారా, ఐదు నిమిషాల విరామం ఉద్యోగులకు యోగాను పరిచయం చేసింది. చిన్న రొటీన్లు పని సంబంధిత ఒత్తిడిని తగ్గించడానికి, ఉద్యోగులకు తాజా అనుభూతిని కలిగించడానికి ఉద్దేశించిందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. దేశంలోని ఆరు ప్రముఖ యోగా సంస్థల సహకారంతో మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా 15 రోజుల ట్రయల్‌ను నిర్వహించిందని తెలిపారు.

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక సర్వేలో జీవనశైలిని మార్చడం, కంప్యూటర్‌పై ఎక్కువ గంటలు గడపడం వల్ల ఉద్యోగులలో పని సంబంధిత ఒత్తిడి ఏర్పడుతుందని తేలింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, మంత్రిత్వ శాఖ, ప్రసిద్ధ యోగా అభ్యాసకులతో కలిసి 2019లో చిన్న ‘యోగా బ్రేక్’ ప్రోటోకాల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 5 నిమిషాల ప్రోటోకాల్ అనేది ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రకారం, కార్యాలయంలో వ్యక్తుల ఉత్సాహంగా పని చేసేందుకు, ఒత్తిడిని తగ్గించడానికి, రిఫ్రెష్ చేయడానికి, పనిపై దృష్టి కేంద్రీకరించడానికి యోగా వ్యాయామాలు ఎంతగానో దోహదపడతాయని భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకమైన యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఆ యాప్‌లో ఏముంది ?
పని చేసే ప్రాంతాల్లో 5 నిమిషాల సేపు రిలాక్స్‌ అవడానికి ఏమేం చెయ్యాలన్న దానిపై 2019లోనే కేంద్రం యోగా నిపుణులతో ఒక కమిటీ వేసింది. వారి సూచనల మేరకు ఈ 5 నిమిషాల యోగా ప్రోటోకాల్‌ను రూపొందించారు. గత ఏడాది జనవరిలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతాలలో దీనిని ఒక పైలెట్‌ ప్రాజెక్టులా ప్రారంభించారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ 5 ని.ల యోగా ప్రోటోకాల్‌ని తప్పనిసరి చేశారు. ఈ నెల 1న కేంద్రం వై–బ్రేక్‌ యాప్‌ని ప్రారంభించింది.

Read Also…  Deepavali Day Act: అమెరికాలోని ఇండియ‌న్స్‌కు గుడ్‌న్యూస్‌.. యూఎస్‌లో దీపావ‌ళి రోజు అధికార సెల‌వు.?