టెక్నాలజీ మహిమో.. ఇంటర్నెట్ వాడకమో గానీ స్మగ్లర్లు తెలివి మీరిపోతున్నారు. కాప్స్ అడ్డుతగులుతున్నా.. క్రియేటివిటీకి పదునుపెట్టి తమ స్మగ్లింగ్ దండాను కొనసాగిస్తున్నారు. అయితే కస్టమ్స్ అధికారులు, పోలీసులను ఏమార్చడం అంత ఈజీ ఏం కాదు. వాళ్లు నిర్వహించే రెక్కిలో చివరికి స్మగ్లర్లు దొరికిపోవడం.. కథ కంచికి చేరడం జరుగుతోంది. తాజాగా రెండు వివిధ సంఘటనల్లో సుమారు 19 కేజీల బంగారాన్ని అక్రమ రవాణా చేసేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను మణిపూర్ కస్టమ్స్ అధికారులు, పోలీసులు కలిసి సంయుక్తంగా పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మణిపూర్‌లోని చన్‌డేల్ జిల్లా తమ్మాపోప్కీలో ఓ స్కూటీలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారని కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. ఇంకేముంది వెంటనే స్పాట్‌కు వెళ్లి మోరెహ్ నుంచి వస్తోన్న రెడ్ స్కూటీని ఆపి కస్టమ్స్ అధికారులు, పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో వారికి 50 బంగారం బిస్కెట్లు లభ్యమయ్యాయి. వీటిని నిందితులు స్కూటీలోని ఎయిర్ ఫిల్టర్లలో దాచి పెట్టినట్లు గుర్తించారు. ఆ బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే మరోవైపు బిస్కెట్ల రూపంలో దాదాపు 11 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. లగేజ్ బ్యాగ్ మధ్యలో బ్లాంకెట్ కింద ప్లాస్టిక్ కవర్‌లో బంగారాన్ని దాచినట్లుగా పోలీసులు గుర్తించారు.