
స్మగ్లర్లు తెలివిమీరిపోయారు. అధికారులు ఎప్పటికప్పుడు వారిని కట్టడి చేస్తున్నా.. కొత్త కొత్త పద్ధతుల్లో బంగారాన్ని తరలిస్తున్నారు. లేటెస్ట్‌గా దుబాయ్ నుంచి అహ్మదాబాద్ వచ్చిన విమానం టాయిలెట్ స్పీకర్లలో బంగారం బయటపడటం అధికారులు సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది. అహ్మదాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఒక విమానం నుంచి 4.26 కోట్ల రూపాయల పైగా విలువైన 2 వేల 799 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా స్మగ్లింగ్‌కు సంబంధించిన ఒక కొత్త పద్ధతి బయటపడింది. కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో సోదాలు నిర్వహించిన సమయంలో టాయిలెట్‌లో రెండు అనుమానాస్పద పౌచ్‌లు దొరికాయి. ఆ పౌచ్‌లు తెరిచి చూడగా, వాటిలో 24 బంగారు బిస్కెట్లు లభించాయి. వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సరికొత్త స్మగ్లింగ్ పద్ధతి అధికారులకు సవాల్ విసిరింది. సాధారణంగా స్మగ్లర్లు ప్రయాణికుల సీట్ల కింద లేదా వారి లగేజీలో బంగారాన్ని దాచడానికి ప్రయత్నిస్తారు. విమానంలోని టాయిలె స్పీకర్లలో బంగారు బిస్కెట్లను దాచడాన్ని ఎవరూ ఊహించలేదు. ఈ బంగారం తమదే అని ఎవరూ క్లెయిమ్ చేయకపోవడంతో.. ఇది ఎవరి పని అని తెలుసుకునే దిశగా అధికారులు విచారణ మొదలుపెట్టారు. విమానంలో ఈ బంగారాన్ని ఎవరు పెట్టారు, దాని ఉద్దేశం ఏమిటి అనే విషయాలను కనుగొనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
విమాన కాక్‌పిట్ సమీపంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించడం ద్వారా ఈ బంగారు బిస్కెట్లను ఎవరు తీసుకొచ్చారు.. టాయిలెట్‌లో ఎవరు దాచారు అనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు విమానంలో టాయిలెట్‌ను ఉపయోగించిన ప్రయాణికులను గుర్తించేందుకు కస్టమ్స్ శాఖ ప్రయత్నిస్తోంది. దీని ద్వారా నిందితులు దొరికే అవకాశం ఉందని భావిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..