Rahul Gandhi: అక్టోబర్ 17న జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ సీనియర్లు అశోక్ గెహ్లాట్, శశి థరూర్ తలపడనున్నట్లు తెలుస్తోంది. దీంతో గాంధీ కుటుంబ బయటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ సారధి కావచ్చని హస్తిన వర్గాల్లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) చేపడుతున్న రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్ష రేసులో నుంచి దాదాపుగా తప్పుకున్నట్లేనన్న ప్రచారం జరుగుతోంది. అయితే రాహుల్ గాంధీయే పార్టీ సారధ్య పగ్గాలు చేపట్టాలన్న డిమాండ్ కూడా ఆ పార్టీలో బలంగా వినిపిస్తోంది. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఇప్పటికే పలు రాష్ట్రాల పీసీసీలు విజ్ఞప్తి చేశాయి. ఆ మేరకు తీర్మానాలు చేసి ఏఐసీసీకి పంపాయి. తాజాగా గోవా కాంగ్రెస్ విభాగం (Goa Congress) కూడా ఈ జాబితాలో చేరింది. రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షిగా నియమించాలంటూ గోవా పీసీసీ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ఏఐసీసీకి పంపనున్నట్లు గోవా పీసీసీ అధికార ప్రతినిధి అమర్నాథ్ పంజికర్ మీడియాకు తెలిపారు. పీసీసీ సభ్యులు తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, తమిళనాడు, బీహార్, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్ముకశ్మీర్ పీసీసీలు కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని నియమించాలంటూ తీర్మానాలు చేశాయి.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి