
అది నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే బస్ స్టాండ్. అక్కడి నుంచి అన్నీ ప్రాంతాలకు బస్సులు ఉండడంతో ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ఎప్పటిలాగే బస్సులు ఎక్కేవారు ఎక్కుతున్నారు.. వెయిట్ చేసేవాళ్లు వెయిట్ చేస్తున్నారు. ఇంతలో బస్ స్టాండ్‌లో పేలుడు పదార్థాలు కనిపించడం ప్రయాణికుల్లో ఒక్కసారిగా భయాందోళనను కలిగించాయి. అవును.. బెంగళూరులో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. ఓ వైపు గుజరాత్‌లో నలుగురు టెర్రరిస్టులను పోలీసులు పట్టుకున్న తరుణంలోనే బెంగళూరులో పేలుడు పదార్థాలు లభించడం ఆందోళన రేపింది. కలాసిపాల్యలోని బస్ స్టాండ్‌లో ఈ పేలుడు పదార్థాలు దొరికాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బస్ స్టాండ్‌లోని టాయిలెట్ సమీపంలో కవర్లలో చుట్టివున్న జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్లను ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని బస్ స్టాండ్ మొత్తం క్షున్నంగా తనిఖీలు చేపట్టారు.
బస్ స్టాండ్‌కు పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. చుట్టుపక్కల సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. 6 జెలటిన్ స్టిక్స్ దొరికాయని డీసీపీ గౌరీష్ తెలిపారు. ఈ బ్యాగుతో ఒక వ్యక్తి కూర్చుని కనిపించినట్లు తెలిపారు. రాళ్లు కొట్టే కార్మికులు దానిని వదిలేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు చెప్పారు. దీనిని ఉద్దేశపూర్వకంగా వదిలేశారా లేదా మర్చిపోయారా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ప్రయాణికుల రద్దీతో ఉండే బస్ స్టాండ్‌లో పేలుడు పదార్థాలు ఒక్కసారిగా భయాందోళన పుట్టించాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..