అదానీ గ్రూప్‌ నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి ఆటోమేటెడ్‌ పోర్టును ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కేరళలోని విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభించారు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి సెమీ-ఆటోమేటెడ్ లోతైన సముద్ర ఓడరేవు. అదానీ గ్రూప్ నిర్మించిన ఈ పోర్టు, AI- ఆధారిత నౌక ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను కలిగి ఉంది. దక్షిణాసియాలో భారతదేశానికి కొత్త సముద్ర ద్వారంగా పనిచేస్తుంది.

అదానీ గ్రూప్‌ నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి ఆటోమేటెడ్‌ పోర్టును ప్రారంభించిన ప్రధాని మోదీ
Pm Modi

Updated on: May 02, 2025 | 1:14 PM

భారతదేశపు మొట్టమొదటి ఆటోమేటెడ్‌ పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదుగా శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. కేరళలోని విజింజం అంతర్జాతీయ ఓడరేవు అదానీ గ్రూప్‌ నిర్మించింది. ఈ పోర్టుల ఇండియాను దక్షిణాసియాలో కొత్త సముద్ర ద్వారంగా నిలపనుంది. కొలంబో, దుబాయ్ వంటి ప్రధాన ఓడరేవులకు పోటీగా దీన్ని నిర్మించారు. దాదాపు 20 మీటర్ల సహజ లోతు, ప్రపంచ షిప్పింగ్ మార్గాలకు సమీపంలో ఉండటం వల్ల పెద్ద కంటైనర్ నౌకలకు అనువుగా దీన్ని నిర్మించారు. ఈ పోర్టులో గతేడాది జూలైలోనే ట్రయల్ రన్‌ ప్రారంభించారు. అధికారిక ప్రారంభానికి ముందు 285 కంటే ఎక్కువ నౌకలు డాకింగ్ చేశాయి. ఇది దేశంలో మొట్టమొదటి సెమీ-ఆటోమేటెడ్ పోర్టు.

విజింజం పోర్టును ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ

ఐఐటీ మద్రాస్ సహకారంతో అభివృద్ధి చేయబడిన AI-ఆధారిత నౌక ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ కలిగి ఉంది. అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాల నుండి కేవలం 10 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఈ పోర్టు, తూర్పు, పశ్చిమ సముద్ర వాణిజ్యాన్ని అనుసంధానించడానికి అనువైన ప్రదేశం. ఈ ఓడరేవులో 1,800 మీటర్ల కంటైనర్ షిప్ బెర్త్, ఫేజ్ 1లో ఏటా 1.5 మిలియన్ TEUల కంటైనర్ హ్యాండ్లింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ప్రపంచ వాణిజ్యంలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచడానికి, కార్గో ట్రాన్స్‌షిప్‌మెంట్ కోసం విదేశీ ఓడరేవులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈ పోర్టు దోహదపడనుంది. విజింజం పోర్టుల ఇండియాలోకి ట్రాన్స్‌షిప్‌మెంట్ ట్రాఫిక్ కదలికను సులభతరం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

ప్రధాని మోదీని సత్కరిస్తున్న గౌతమ్ అదానీ

ఈ పోర్టు ప్రారంభం సందర్భంగా అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ ఎక్స్‌ వేదికగా ఒక పోస్ట్‌ కూడా చేశారు. ఈరోజు.. విజింజం ద్వారా కేరళ ప్రపంచానికి భారతదేశ ప్రవేశ ద్వారంగా మారాలనే 30 ఏళ్ల కలగా నిజమైంది. చరిత్ర, విధి, అవకాశం కలిసి రావడంతో ఇది సాధ్యమైంది. ఇండియాలో మొట్టమొదటి లోతైన సముద్ర ఆటోమేటెడ్ పోర్టును నిర్మించినందుకు మేం గర్విస్తున్నాం. ఇది.. భవిష్యత్ ప్రపంచ ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్. ఇది దార్శనికత, స్థితిస్థాపకత, భాగస్వామ్యపు విజయం. ప్రధాని నరేంద్ర మోదీకి, సీఎం పినరయి విజయన్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్‌ చేశారు.