జీ20 సమావేశాలు రెండు రోజుల పాటు జరుగుతాయి. అంటే ఈ రెండు రోజుల పాటు దేశ విదేశాల ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఉంటారు. అందుకే వారి బస ఏర్పాట్లపైనా ప్రత్యేక దృష్టి పెట్టింది కేంద్రం. అగ్రరాజ్యాల నుంచి అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యే జీ20 సమావేశ మందిరం అంటే ఓ రేంజ్‌లో ఉండాలి కదా.. అందుకే కనీవినీ ఎరుగని రీతిలో భారత మండపం సిద్ధమైంది. ఈ మండపంలో ఒక్కో అడుగులో విశిష్టతలు, ప్రత్యేకతలు.. తెలుసుకుంటే ఎవరైనా ఔరా అనాల్సిందే.
జీ-20 సదస్సు కోసం ప్రత్యేకంగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారత మందిరం సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ మండపం.. సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జీ-20 ముఖ్యవేదికను ప్రగతి మైదాన్‌లోని భారత్‌మండపంలో ఏర్పాటు చేశారు. మన సంస్కృతి కళావైభవం ఉట్టిపడేలా భారత్‌మండపాన్ని తీర్చిదిద్దారు. పలు రాష్ట్రాలకు సంబంధించిన సాంస్కృతిక వారసత్వ వైభవ చిహ్నాలను అమర్చారు. సాంస్కృతిక వైభవంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి అధునాతన సౌకర్యాలతో భారత్‌మండపం సిద్ధం చేశారు.
సుమారు 123 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ కాంప్లెక్స్ భారతదేశపు అతిపెద్ద మీటింగ్ కన్వెన్షన్ సెంటర్‌గా అభివృద్ధి చేయబడింది. సుమారు 3వేల కోట్లు ఖర్చైనట్లు తెలుస్తోంది. ఈ మండపంలో ఉన్న మల్టీపర్పస్ హాల్, ప్లీనరీ హాల్‌లో 7000 మంది కూర్చునే సామర్ధ్యం ఉంది. ఈ హాల్ ఆస్ట్రేలియాలోని పాపులర్ సిడ్నీ ఒపెరా హౌస్ సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ. అంతే కాకుండా ఆధునిక సౌకర్యాలతో అనేక సమావేశ గదులు, లాంజ్‌లు ఇంకా ఆడిటోరియాలు కూడా ఉన్నాయి. మండపం మందున్న 25 అడుగుల ఎత్తైన నటరాజ విగ్రహం.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గ్రాండ్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్, ట్రేడ్ ఫెయిర్‌లు, కన్వెన్షన్‌లు, కాన్ఫరెన్స్‌లతో పాటు ప్రతిష్టాత్మకమైన సమావేశాలను నిర్వహించేలా ఈ ఆర్కిటెక్చరల్ మాస్టర్ పీస్.. రూపొందించారు.
అమెరికా అధ్యక్షులు జో బైడెన్ దగ్గర నుంచి.. జీ20లో సభ్యులుగా ఉన్న అన్ని దేశాలు రెండు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయబోతున్నారు. దేశవిదేశాల నుంచి వేలాది మంది అతిథులు హస్తిన వీధుల్లోకి రాబోతున్నారు. వీళ్లందరి కోసం దేశరాజధానిలోని ప్రముఖ హోటల్స్‌లో బస ఏర్పాట్లు చేసింది కేంద్రం. భారత్ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షులు జో బైడెస్ ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేస్తారు. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిషి సునాక్ భారత్‌లో చేపడుతున్న తొలి అధికారిక పర్యటన ఇది. ఈ పర్యటనలో ఆయన ఢిల్లీలోని షంగ్రిలా హోటల్‌లో ఉంటారు.
ఇక చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు బదులు.. చైనా ప్రధాని లీ-కీయాంగ్ G-20 సదస్సుకు హాజరుకానున్నారు. చైనా ప్రతినిధుల బృందం ఢిల్లీలోని తాజ్ హోటల్‌లో విడిది చేస్తుంది. ఆసియాన్ సదస్సులో పాల్గొని జకార్తా నుంచి శనివారం నేరుగా ఇండియాకు రానున్నారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడు. ఆయన ఢిల్లీలోని లలిత్ హోట్‌లో బస చేస్తారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత్ వస్తున్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్ ఢిల్లీలోని ఇంపీరియల్ హోటల్‌లో ఉంటారు.
మరోవైపు ఇప్పటికే అనధికారిక లాక్ డౌన్‌లోకి సెంట్రల్ ఢిల్లీ వెళ్లిపోయింది. లక్షమంది భద్రతా సిబ్బంది డేగ కళ్లతో ఢిల్లీని కాపలా కాస్తున్నారు. 24/7 కంటి మీద రెప్ప వేయకుండా పారాహుషార్ అంటున్నారు. ఇక డాగ్ స్క్వాడ్లు, బాంబు స్క్వాడ్లను రంగంలోకి దింపి దేశ రాజధానిని అణువణువు జల్లెడ పడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..