Free Fuel: దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోవడమే ఆలస్యం.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంధనం ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న చమురు ధరలు సామాన్యులకు గుదిబండలా మారుతున్నాయి. ముఖ్యంగా ఇంధన ధరల పెరుగుదుల వాహనదారులకు పెద్ద సమస్యగా మారింది. ఇక ఆటో వాలాల పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. అసలే కరోనా సంక్షోభం.. ఆపై పెరుగుతున్న పెట్రోల్, ఢీజిల్ ధరలు వారికి గుదిబండలా పరిణమించాయి. అయితే, ఇంతటి సంక్షోభంలో ఆటోవాలాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించిన ఓ మహానుభావుడు ఊహించని రీతిలో వారికి అండగా నిలిచారు. ఆటోవాలాలకు పరిమితితో కూడిన పెట్రోల్, డీజిల్‌ను ఉచితంగా అందజేశాడు.
ఈ ఘటన తాలూకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కేరళ రాష్ట్రంలోని కాసర్‌గోడ్ జిల్లా ఎన్మకాజె గ్రామ పంచాయతీ పరిధిలో ఓ ఫ్యూయల్ స్టేషన్ ఉంది. ఆ ఫ్యూయల్ స్టేషన్‌కు అబ్దుల్లా మధుమోల్ యజమాని కాగా, అతని సోదరుడు సిద్ధిక్ మధుమోల్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, అబ్దుల్లా మధుమోల్.. అబుదాబిలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అయితే, ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న సిద్ధిక్ మధుమోల్.. అబ్దుల్లాను సంప్రదించి కష్టాల్లో ఉన్న ఆటోవాలాలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ ఓకే అనుకున్న తరువాత.. ఆటో వాలాలకు మూడు లీటర్ల చొప్పున ఉచిత ఇంధనం ఆఫర్ ప్రకటించారు.
సోమవారం ఉదయం 6.30 గంటల నుంచి మంగళవారం సాయంత్రం వరకు రెండు రోజుల పాటు ఈ ఆఫర్ ఉంటుందని ప్రకటించారు. ఈ ఆఫర్‌ను చాలా మంది ఆటోవాలాలు ఉపయోగించుకున్నారు. రెండు రోజుల వ్యవధిలో మొత్తం 313 మంది ఆటో డ్రైవర్లు ఈ ఆఫర్‌ను వినియోగించుకున్నారు. మొత్తం రూ. లక్ష విలువైన ఇంధనాన్ని ఉచితంగా పంపిణీ చేసినట్లు సిద్ధిక్ మధుమోల్ వెల్లడించారు. వీరి ఆఫర్ ప్రకటన పట్ల ఆటోడ్రైవర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఫ్యూయల్ యజమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
Also read:
IND Vs NZ, WTC Final 2021 Day 1 Live: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వరుణుడు షాక్.. ఫస్ట్ సెషన్ రద్దు..